శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (18:40 IST)

చంద్రబాబుతో పన్నీర్ సెల్వం చర్చలు సఫలం.. తెలుగు గంగ నుంచి నీరిస్తారా? సహారా డైరీలో బాబు పేరు?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి వచ్చిన పన్నీర్ సెల్వం.. అనంతరం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని చంద్రబాబు

త మిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి వచ్చిన పన్నీర్ సెల్వం.. అనంతరం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలుగు గంగ నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కోరేందుకు పన్నీర్ సెల్వం అమరావతికి చేరుకున్నారు. 
 
నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1984లో తమిళనాడు ప్రజలకు తాగునీరు అందించేందుకు తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ కోరిక మేరకు పెన్నా నది నుంచి 4 టీఎంసీల నీటిని చెన్నైకి ఇచ్చేందుకు ఎన్టీఆర్ తెలుగు గంగ పథకాన్ని ప్రారంభించారు. ఆ తరవాత అనతి కాలంలోని ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చింది. ఏటా 4 టీఎంసీల నీటిని చెన్నైకి ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది వర్షాభావ కారణాల వల్ల పెన్నా నదిలో నీరు లేకపోవడంతో చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీటిని విడుదల చేయలేదు.
 
అందుచేత తెలుగు గంగ ద్వారా తమిళ రాష్ట్రానికి నీరు ఇవ్వాల్సిందిగా పన్నీర్ చంద్రబాబు కోరారు. దీనిపై చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. చెన్నై నగరానికి తెలుగుగంగ నుంచి మంచినీటిని సరఫరా చేసే విషయమై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు.
 
ఈ సందర్భంగా చెన్నైకి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు, ఈ విషయమై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. త్వరలో రెండు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
 
ఇదిలా ఉంటే.. సహారా డైరీలలో చేతిరాతతో రాసిన ముడుపులు అందుకున్న వారి జాబితాలో ఆయన పేరు నాలుగుసార్లు ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన బిర్లా సహారా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు రూంలో ప్రశాంత్ భూషణ్.. సహారా డైరీలలో పేర్లు ఉన్న రాజకీయ నాయకుల వివరాలను వెల్లడించినట్లు 'సాక్షి'లో కథనం ప్రచురితమైంది.