బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (18:31 IST)

ఏపీ సర్కారు పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి.. పవన్ డిమాండ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ సర్కారును పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందన్నారు. పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత మాత్రం మంచిది కాదని సర్కారును ఆయన హెచ్చరించారు. 
 
ఇప్పటికే ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరోనా ప్రభావంతో డిగ్రీ, పి.జి., ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దయిపోయాయని ఎత్తిచూపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఇప్పటికే 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని పవర్ స్టార్ గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోందన్నారు. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాలా తక్కువగా వున్నాయని తెలిపారు. 
 
ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు రద్దు చేసి, పొరుగు రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను పాటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతునన్నారు.