శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:53 IST)

పవన్... కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.. జేపీ కామెంట్స్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఏదో చేయాలన్న తపన పవన్‌కు బలంగా ఉందన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఏదో చేయాలన్న తపన పవన్‌కు బలంగా ఉందన్నారు. అందువల్లే ఆయన ఏరికోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఒక అగ్రహీరోగా, కాలు మీద కాలేసుకుని జీవించాల్సిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం అంటే ఓ సాహసంతో కూడుకున్న పనేనని, స్పష్టంగా చెప్పాలంటే కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారన్నారు. 
 
జనసేన అధినేత పవన్‌కల్యాణ్, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణతో గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. బేగంపేట లోక్‌సత్తా కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. వీరిద్దరూ సుమారు గంటపాటు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా, జేపీ అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడారు. నిజానికి ఆయనను చూడటానికి లక్షలాది మంది డబ్బులిచ్చి వస్తారన్నారు. 
 
కానీ ఆయన మాత్రం ఈ సమాజానికి ఏదో చేయాలన్న తపనతో సవాళ్లతో కూడిన జీవనంలోకి వస్తున్నారన్నారు. పవన్ చిన్న వయసులోనే ఈ బాటను ఎంచుకుని, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారని కితాబిచ్చారు. ఏ సమాజంలో అయితే మనం పెరిగామో, ఆ సమాజానికి ఏదో చేయాలనే బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇది సాధ్యమని చెప్పారు. అందుకు వపన్ ను మనసారా అభినందిస్తున్నానని తెలిపారు.
 
పవన్, తాను ఇద్దరం లోతుగా, మనసు విప్పి మాట్లాడుకున్నామన్నారు. రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు, పౌర సమాజం పేరుతో కావచ్చు, పత్రికల పేరుతో కావచ్చు... తమలాంటి అభిప్రాయాలు ఉన్నవారు, అధికారమే పరమావధిగా భావించకుండా ఉండే వ్యక్తులంతా ఒకటై... సమాజం కోసం ఏమేం చేయగలమనే విషయంపై చర్చించుకున్నామన్నారు. 
 
ఒకసారి పార్లమెంటులో చర్చించిన తర్వాత, చట్టంలో పెట్టిన తర్వాత హామీలను నెరవేర్చకపోవడం చాలా దారుణమైన విషయమని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఏమీ దక్కకపోవడం అన్యాయమని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందాల్సినవి చాలా ఉన్నాయన్నారు. వీటిని విస్మరిస్తే... ప్రభుత్వాల మీద, పార్టీల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. కొన్నింటిని చట్టంలో పెట్టకపోయినప్పటికీ... సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి పార్లమెంటులో హామీల రూపంలో ఇచ్చారని... ఇప్పుడు చట్టంలో అవి లేవని దాటవేయడం దారుణమని అన్నారు. 
 
అందరితో కూర్చొని ఒక భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుందామని పవన్ ముందడుగు వేశారని... ఇది ఒక మంచి నిర్ణయమని, ఆయన నిర్ణయాన్ని అందరూ అభినందించాలన్నారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదని, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అని అని అన్నారు. సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని బుందేల్ ఖండ్ వెనుకబాటు తనంపై ఓ ప్రకటన చేశారన్నారు. కేంద్రం లెక్కల ప్రకారమే రాయలసీమ బాగా వెనుకబడివుందన్నారు. ఈ ప్రాంతానికి బుందేల్ ఖండ్‌కు ఇచ్చినట్టుగానే నిధులు కేటాయిస్తున్నారా అని జేపీ ప్రశ్నించారు. కాగా, ఈనెల 11వ తేదీన పవన్‌తో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌ భేటీకానున్నారు.