శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (15:44 IST)

మన అమరావతి, మన మట్టి- మన నీరు: 13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి..?

అమరావతి శంకుస్థాపన ఉత్సవాలు మంగళవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమైనాయి. శంకుస్థాపన కార్యక్రమాన్ని వారోత్సవాలుగా నిర్వహించాలని ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని 13వేల గ్రామాలు, 3000 మున్సిపల్ వార్డుల నుంచి మట్టితో పాటు నీటిని కూడా సేకరించనున్నారు. 
 
పాడ్యమి, దసరా శుభ ఘడియలు ప్రవేశించే 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మట్టి, నీరు సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో, వార్డులో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీ సభ్యులు, పురోహితులు, అర్చకులు ర్యాలీగా ఎంపిక చేసిన ప్రదేశానికి వెళ్లి వేదోక్తంగా మట్టిని, నీటిని సేకరిస్తారు. సాధ్యమైనంతవరకు పుట్టమన్ను, నదీపరివాహక ప్రాంతంలోని మట్టి, చెరువు మట్టిని మాత్రమే సేకరిస్తారు. అలాగే నది, తాగునీటి చెరువు లేదా బావి, దేవాలయం బావి తదితరాల్లో ఒకదాని నుంచి నిర్దేశిత కలశంలో నీటిని సేకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. 
 
మట్టి, నీరు సేకరణ సమయాల్లో అన్ని మతాల వారితో పూజలు, ప్రార్థనలు జరిపించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని బాబు తెలిపారు. కిలో మట్టిని, కలశంతో నీటిని వేర్వేరుగా పసుపు సంచి, పాలిథీన్‌ కవర్‌లో ఉంచాలి. వాటిని 13, 14 తేదీల్లో గ్రామాల్లో వేడుకగా ఊరేగించాలి. 14 సాయంత్రం గ్రామాల నుంచి తహసీల్దారు కార్యాలయాలకు చేర్చాలి. వారు ఈ మట్టికి రాష్ట్రవ్యాప్తంగా 160 ప్రసిద్ధ ఆలయాలు, 50 చర్చిలు, 50 మసీదులు, దర్గాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
ఈ మట్టి రాజధానికి ఎలా తరలిస్తారంటే.. మట్టి, నీటిని అట్టపెట్టెల్లో పేర్చి 15వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మండల కేంద్రాలకు తరలించాల్సి వుంటుంది. తరలించే వాహనాలకు ‘మన అమరావతి, మన మట్టి- మన నీరు’ అనే బ్యానర్ తప్పనిసరిగా ఉండాలి. మండలం పేరు తప్పనిసరి. 16, 17 తేదీల్లో మండల కేంద్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
17వ తేదీ సాయంత్రం నియోజకవర్గ కేంద్రాలకు తరలిస్తారు. 18వ తేదీ సాయంత్రం పవిత్ర కలశాలను ఊరేగింపుగా జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. 19న మంత్రులు జెండా ఊపడంతో జిల్లా కేంద్రాల నుంచి మట్టి, నీరు ఉంచిన వాహనాలు గుంటూరుకు తరలివెళ్తాయి. ఈ వాహనాలన్నీ నాగార్జున యూనివర్సిటీ ఎదుట నిర్దేశిత స్థలానికి ఏకకాలంలో చేరుకోవాలి. 20న భారీ ఊరేగింపుతో మట్టిని, నీటిని అమరావతికి తీసుకెళ్తారు.