శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (11:01 IST)

ట్యాపింగ్ నిజం.. కేసీఆర్‌ సర్కారుకు మూడినట్టేనా? ప్రేక్షక పాత్రలో కేంద్రం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది నిజమని తేలిపోయింది. టెలిఫోన్ ట్యాపింగ్‌‌కు సంబంధించిన కాల్ డేటాను విజయవాడ కోర్టుకు ఇవ్వకుండా స్టే విధించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం.. ఈ కేసును వాదించేందుకు సీనియర్ మోస్ట్ న్యాయవాది రాంజెఠ్మలానీని రంగంలోకి దించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పిడిందనే విషయం తేలిపోయింది. 
 
అయితే, ఇపుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్‌‍కు పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయ్. ట్యాపింగ్ చేసిన టెలిఫోన్ నంబర్లు కళ్లముందు కనిపిస్తున్నాయ్. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు. విజయవాడ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం.. అక్కడ ఆమోదముద్ర పడటంతోనే కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టాయి. దీంతో సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే కాల్ డేటా విజయవాడ కోర్టుకు ఇవ్వరాదంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఇందుకోసం రూ.కోట్లకు కోట్లు పెట్టిన రాంజెఠ్మలానీతో వాదనలు వినిపించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆయనకు వర్తిస్తున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్‌లో ఆయనను ఎవరు కాపాడుతారనే అంశంపైనే ఇపుడు రసవత్తర చర్చ సాగుతోంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో కేంద్రం కూడా ప్రేక్షకపాత్ర వహిస్తోంది. 
 
టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోర్టులో ఉన్నపుడు, ఆధారాలు మరింత బలంగా ఉన్న సమయంలో హోంశాఖ కూడా అంపైర్ పాత్ర పోషించకుండా ప్రేక్షక పాత్ర పోషించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. పంచాయతీ కోర్టు దృష్టికి వెళ్లడంతో వదలమంటే ఏపీకి కోపం.. సర్దుకుపొమ్మంటే తెలంగాణకు తలకెక్కదు. అందుకే ప్రేక్షక పాత్రకే పరిమితంకావాలనే నిర్ణయానికి వచ్చింది.