శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Ivr
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2015 (13:09 IST)

16 వేల గ్రామాల నుంచి మట్టి... అతిథుల కోసం 16 హెలికాప్టర్లు... చంద్రబాబా మజాకా...

అమరావతి రాజధాని శుంకుస్థాపన అట్టహాసంగా జరుగబోతోంది. తుళ్లూరులోని ఉద్దండరాయునిపాలెంకు చెందిన పవిత్ర కృష్ణా నదికి సమీపాన అమరావతికి ఈశాన్యంలోని 250 ఎకరాల భూమిలో 25 ఎకరాల్లో శంకుస్థాపన చేయనున్నారు. విజయదశమి పర్వదినం... అక్టోబరు 22న ఈ కార్యం జరుపతలపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. 
 
శంకుస్థాపనకు గాను నవ్యాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన 16వేల గ్రామాల నుంచి మట్టిని స్వర్ణకలశాల ద్వారా రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంతానికి తీసుకువస్తారు. ఈ మట్టిని ఆయా గ్రామాల్లో కొలువై ఉన్న దేవతామూర్తులకు పూజించిన తర్వాత రాజధాని ప్రాంతానికి తీసుకువస్తారు. 
 
ఇకపోతే అమరావతి రాజధాని శంకుస్థాపనకు జపాన్ మంత్రులతో సహా సింగపూర్ ప్రధాని కూడా రానున్నట్లు సమాచారం. ఇంకా దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వ్యాపారదిగ్గజాలు సైతం రానున్నట్లు చెపుతున్నారు. వీరిని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాజధాని ప్రాంతానికి చేరవేసేందుకు 16 హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి రాజధాని శంకుస్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.