శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:54 IST)

ఎంట్రీ ట్యాక్స్‌పై కోర్టుకెక్కిన ట్రావెల్స్ యాజమాన్యాలు!

అంతర్ రాష్ట్ర రవాణా పన్ను (ఎంట్రీ ట్యాక్స్)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ట్రావెల్స్ యాజమాన్యాలు కలిసి సంయుక్తంగా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. దాంతోపాటు మరో రెండు వేర్వేరు పిటిషన్‌లు కూడా దాఖలయ్యాయి. 
 
ఈ పిటీషన్లు అన్నింటిపై బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. గత అర్థరాత్రి నుంచి తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను వసూలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో లారీ యాజమాన్యాలు, ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
 
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అర్థరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన అంతర్ రాష్ట్ర పన్ను పెను వివాదాన్నే సృష్టించేలా ఉంది. ఇప్పటికే అటు ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని వర్గాలు అంతర్ రాష్ట్ర పన్నుపై నిరసన వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. పన్ను పోటుకు భయపడి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సుల సర్వీసులను నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చెక్ పోస్టుల వద్ద లారీ ఓనర్లు ఆందోళనకు దిగారు. దీంతో, ఇరు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన బాట పట్టిన లారీ ఓనర్లకు పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో ఆందోళనలు సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచివుంది.