శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (07:07 IST)

బీజేపీ లాభం లేదు... జగన్‌ చెంతకెళ్దాం... వైకాపాలోకి పురంధేశ్వరి

భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత కాపులంతా మళ్లీ పార్టీ మారాలన్న యోచనలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు ఉండగా, మరో సీనియర్ నేతా ఉన్నారు. వారెవరో కాదు దగ్గుబాటు పురంధ

భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత కాపులంతా మళ్లీ పార్టీ మారాలన్న యోచనలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు ఉండగా, మరో సీనియర్ నేతా ఉన్నారు. వారెవరో కాదు దగ్గుబాటు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావులతో పాటు కన్నా లక్ష్మీ నారాయణలు. వీరంతా కాంగ్రెస్ పార్టీ పాత కాపులు. 
 
వీరిలో పురంధేశ్వరి, కావూరిలు రాష్ట్ర విభజనానంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. కానీ, అక్కడ వీరిద్దరి హవా సాగలేదు. దీంతో సైలెంట్ అయిపోయారు. పురంధేశ్వరి మాత్రం అపుడపుడు మీడియా ముందు కనిపిస్తున్నా.. కావూరి మాత్రం ఇంటికే పరిమితమైపోయారు. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి, మహిళా మోర్చా నేతగా ఉన్న పురంధేశ్వరి పార్టీ మారనున్నారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీలో ఆమె చేరుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీలో ఆమెకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం, ఏపీలో ఆ పార్టీకి తగినంత పట్టు లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరాలని పురంధేశ్వరి చూస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈమెతో వైకాపా నేత విజయసాయి రెడ్డి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలోకి ఆమెను తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి ఆమెను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, 2014 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పురంధేశ్వరి ఓడిపోయిన విషయం తెల్సిందే. ఇకపోతే... బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ కూడా వైఎస్సార్సీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.