శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (16:53 IST)

కాపులను బీసీల్లో చేరుస్తుంటే.. మేము గాజులు తొడుక్కుని ఉన్నామా?: ఆర్ కృష్ణయ్య

అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కాపులను తీసుకొచ్చి బీసీల్లో చేరుస్తామంటే తాము చూస్తూ మిన్నకుండేందుకు తాము ఏమైనా గాజులు తొడుక్కుని ఉన్నామా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. 
 
కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షను విరమింపజేసేందుకు ప్రభుత్వం నడిపిన రాయబారం నడిపింది. ఇందులో ఆయన డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. దీంతో ఆయన దీక్షను విరమించారు. దీనిపై ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. 
 
కాపులను బీసీల్లో చేరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాపులను బీసీల్లో చేర్చాలంటే శాస్త్రీయమైన అధ్యయనం జరగాలని సూచించారు. ముందుగా కాపుల వాస్తవ జనాభా ఎంతో నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ఉద్యోగాలు, ప్రభుత్వ సౌకర్యాల్లో వారు అనుభవించేది ఎంత శాతం? అనేది తేల్చాలన్నారు. 
 
ఆ తర్వాత ఇతర బీసీల సంఖ్యతో దానిని మదించాలని, అప్పుడు వారు అనుభవిస్తున్న సౌకర్యాలతో కాపులు అనుభవిస్తున్న సౌకర్యాలను కూడా మదించి నిగ్గుతేలిస్తే... బీసీల్లో కాపులను చేర్చడం సమంజసమా? కాదా? అన్నది తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ లేకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదన్న ఆయన, విధ్వంసం జరిగితే సౌకర్యాలు కల్పిస్తామంటే చాలా వర్గాలు విధ్వంసాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి ఉద్యమ హెచ్చరికలు పంపారు.