శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (08:58 IST)

నేడు చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల.. ఘన స్వాగతానికి తెదేపా శ్రేణుల ఏర్పాట్లు

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీ టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ టీడీపీ ఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి నేడు విడుదల కానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆయన మంగళవారమే బెయిల్ లభించినప్పటికీ బెయిల్ మంజూరు కాపీలు కోర్టు నుంచి జైలుకు వచ్చేందుకు ఆలస్యమయ్యాయి. ఈ సాంకేతిక కారణంగా రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది. 
 
కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులైన సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహలకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెల్సిందే. రేవంత్‌ రెడ్డిని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం పరిధి దాటరాదని ఆంక్షలు విధించింది. అయితే, రేవంత్‌ రెడ్డితోపాటు మిగిలిన ఇద్దరూ మంగళవారం సాయంత్రానికే విడుదల కావాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. 
 
వాస్తవానికి బెయిల్‌ రావడంతో సాయంత్రానికి రేవంత్‌ విడుదలవుతారని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు భావించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే సంతోషంతో వేడుకలు చేసుకున్నారు. చర్లపల్లి జైలు వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. అయితే, రేవంత్‌ రెడ్డి తదితరుల బెయిల్‌ మంజూరుకు సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల కాపీ సాయంత్రం 4.30 గంటలకు విడుదలైంది. దానిని తొలుత ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జికి చూపించాలి. ష్యూరిటీ సంతకాలు చేసి, పూచీకత్తు మొత్తం జమ చేయాలి. 
 
అనంతరం న్యాయమూర్తి అనుమతితో నిందితులను విడుదల చేస్తారు. రేవంత్‌ న్యాయవాదులు కూడా ఇదే భావించారు. ఇలాగే రేవంత్‌ తదితరులను విడుదల చేయించుకుని తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారు. కానీ, చివరి నిమిషంలో వారికి చుక్కెదురైంది. ‘హైకోర్టు ఉత్తర్వుల కాపీలో ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉంది. టైపింగ్‌ పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. ఈ విషయమై సీనియర్‌ న్యాయవాదులతో చర్చించి బుధవారం హైకోర్టులో సవరణ మెమో దాఖలు చేస్తాం. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళతాం’ అని రేవంత్‌ తరపు న్యాయవాది సుధీర్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం ప్రక్రియ పూర్తయి, బుధవారం సాయంత్రానికి రేవంత్‌ బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.