అమరావతి : కేంద్ర ప్రభుత్వం, హెచ్.పి. సంస్థ సహకారంతో విశాఖపట్నంలో 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో మల్టీ స్కిల్ డవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. స్కిల్ యూనివర్శిటీ, మల్టీ స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లకు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. వీటిత పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలోనూ మోడల్ కెరీర్ సెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో స్కిల్ డవలప్మెంట్ సంస్థ ద్వారా ఈ మూడన్నరేళ్లలో 8.67 లక్షల మందికి యువతకు వివిధ ఉపాధి అంశాల్లో శిక్షణఅందించామన్నారు. ఈ ఏడాది మరో 8 లక్షల మందికి శిక్షణివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం స్కిల్డవలప్ మెంట్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
గడిచిన మూడన్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో వివిధ అంశాల్లో 8.67 లక్షల మందికి ప్రభుత్వం శిక్షణిచ్చిందన్నారు. వారిలో కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 6.80 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు రూ.1.87 లక్షల మంది ఉన్నారన్నారు. శిక్షణ పొందినవారిలో 90,850 మందికి ప్లేస్ మెంట్ కూడా ఇప్పించామన్నారు. వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు 23,267 మంది, డిగ్రీ అర్హత కలిగిన వారు 17,049 మంది, వివిధ ప్లేస్ మెంట్ల ద్వారా ఎంపికైనవారు 40,784మంది ఉన్నారన్నారు. ఈ ఏడాది కూడా 8 లక్షల మందికి స్కిల్ డవలప్ మెంట్ ద్వారా శిక్షణివ్వాలని భావిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో టాటామోటార్స్, అశోక్ లైల్యాండ్, విప్రో వంటి ఎన్నోపరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, మరెన్నో ఏర్పాటుకాబోతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆయా పరిశ్రమలకు అవసరాలకనుగుణంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. సర్టిఫికెట్ కోర్సులపై శిక్షణివ్వడానికి గుగూల్, సాన్ ఫోర్డ్, అమోజాన్ వంటి ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. ఇంటర్వ్యూల్లో ఈ సర్టిఫికెట్ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
రూ.3,350 కోట్లతో 40 సీమన్స్ సెంటర్లు...
సీమన్స్ సంస్థ రాష్ట్రంలో 40 స్కిల్ డవలప్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. వాటిలో 6 ఎక్స్ లెన్స్ సెంటర్లు, 34 టెక్నాలజీ సెంటర్లు ఉంటాయన్నారు. రూ.3,350 కోట్లతో ఈ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం 10 శాతం, సీమన్స్ సంస్థ 90 శాతం భరించనున్నాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు మరింత ఆధునిక శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. డి.డి.యు.జి.కె.వై., పి.ఎం.కె.వి.వై., సాగరమాల కింద శిక్షణ కార్యక్రమాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ అందజేస్తున్నామన్నారు.
కియా మోటార్స్ లో 4 వేలు ఉద్యోగాలు, ఏసియన్ పెయింట్స్ లో 700, హీరో కంపెనీలో 14 వేలు, అశోక్ లైల్యాండ్ లో 7వేలు, జైన్ లో 350, అపోలోలో 1400 ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల కేంద్రాల్లోనూ మోడల్ కెరీర్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 3 మల్టీ స్కిల్ డవలెప్ సెంటర్లను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఏర్పాటుచేయనున్నామన్నారు. ఈ కేంద్రాలను 15 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు.
ఇప్పటికే విజయవాడలోని గన్నవరంలో ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేస్తామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఆయా కంపెనీలే స్వయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. విశాఖపట్నంలో 100 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం, హెచ్.పి సంస్థ సహకారంతో స్కిల్ యునివర్శిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు. అమరావతిలో ఎల్ అండ్ టి సంస్థకు 5 ఎకరాలు ఇచ్చామన్నారు. ఈ భూములో స్కిల్ డవలప్ సెంటర్ ను ఎల్ అండ్ టి సంస్థ ప్రారంభిస్తుందన్నారు. అలాగే మరిన్ని సంస్థలు స్కిల్ డవలప్ మెంట్ సెంటర్ల స్థాపనకు ముందుకొస్తున్నాయన్నారు.
ఉపాధి కల్పనలో ఏపీకి 10 ర్యాంకు
ఇటీవల కొండపల్లి బొమ్మల తయారీ, ఏటికొప్పాక బొమ్మలు వంటి 26 అంశాల్లో రాష్ట్ర స్థాయి స్కిల్ కాంపిటీషన్లు నిర్వహించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీనిలో ఎంపిక వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ ఎంపికయితే అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళతామన్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ పదో స్థానంలో నిలిచిందన్నారు. భవిష్యత్తులో మొదటిస్థానంలో నిలవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
శిక్షణ, ఉపాధి అవకాశాల వివరాలకు వెబ్ పోర్టల్
నిరుద్యోగ యువత కోసం వెబ్ పోర్టల్ ప్రారంభించామని రాష్ట్ర యువజనలు, క్రీడలశాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. jobskill.apssdc.in లాగిన్ అయితే ఎక్కడెక్కడ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి.... ఉపాధి అవకాశాలు ఎక్కడ లభ్యమవుతున్నాయి ? వంటి తెలుసుకోవొచ్చునన్నారు. డైరీ కూడా రూపొందించామన్నారు. ఆ డైరీ లో ఆయా జిల్లాల్లో ఉన్న స్కిల్ డవలప్ సెంటర్ల వివరాలు ఉంటాయన్నారు. త్వరలో ఆ డైరీలను జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రాన్నినాలెడ్జ్ స్టేట్ గా రూపొందించడానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రజలందరికీ స్కిల్ డవలప్ మెంట్ శిక్షణలు చేరువచేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.