శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (15:42 IST)

పవన్ కళ్యాణ్‌ కారుపై చెప్పు విసిరిన అగంతకుడు

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఖమ్మం జిల్లాలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆయన ప్రయాణించే కారుపై గుర్తు తెలియని ఓ అగంతకుడు

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఖమ్మం జిల్లాలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆయన ప్రయాణించే కారుపై గుర్తు తెలియని ఓ అగంతకుడు చెప్పు విసిరాడు. తెలంగాణ యాత్రలో భాగంగా ఆయన బుధవారం ఖమ్మంలో పర్యటిస్తున్నారు. 
 
ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఆయన వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఆ జన సమూహంలో పవన్‌పైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే అదృష్టవశాత్తూ అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
 
అనంతరం ఆయన ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, "నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేయాలి. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. నాకు కులం, మతం లేదు. మానవత్వం, జాతీయతను గౌరవిస్తా. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉంది. కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేము. మెత్తగా మాట్లాడతానని కొందరు అనుకోవచ్చు. 
 
వ్యూహంలో భాగంగానే కొద్దిగా తగ్గుతాను. ఎన్నికల్లో సీట్లు ఇస్తేనే సామాజిక న్యాయం జరగదు. తమ కులం అభివృద్ధి చెందకపోవడంపై నేతలు ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదు. కార్యకర్తలు సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు తెలుసుకోవాలి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య నన్ను కదిలించింది. ప్రజలకు అండగా నిలబడితే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. ఇంతకాలం ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు? జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలను వెలుగులోకి తేవాలి. సమస్యలపై అధికారపక్షాలను నిలదీయడమంటే తిట్టడం కాదు.. నా జీవితం జనసేన కార్యకర్తలకు అంకితం. నేను పదవులు కాదు.. సామాజిక మార్పు కోరుకుంటున్నా. ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను" అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.