శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 5 మే 2017 (21:06 IST)

మిర్చి రైతులూ అధైర్యపడవద్దు... ఒక్కో రైతు ఖాతాలో రూ.30 వేలు... సోమిరెడ్డి

అమరావతి : మిర్చి రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. అవసరమైతే అదనంగా ఇచ్చే రూ.1500లను

అమరావతి : మిర్చి రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. అవసరమైతే అదనంగా ఇచ్చే రూ.1500లను జూలైలో కూడా కొనసాగిస్తామని చెప్పారు. మిర్చి క్వింటాల్‌కు రూ.1500ల చొప్పున ఒక్కో రైతులకు 20 క్వింటాళ్ల వరకు అదనపు ధర పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ ప్రకారం ఒక్కో రైతుకు రూ.30 వేలు వారి వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు తెలిపారు. మిర్చి సాగు విస్తీర్ణం పెరగడం, ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉండి కూడా ఉదయం మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రైతులను ఆదుకునే విషయంలో నిధుల సమస్య లేదని, బడ్జెట్ గురించి ఆలోచించవద్దని, రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోమని సీఎం చెప్పినట్లు తెలిపారు.
 
రైతుల నుంచి వచ్చే మిర్చి బస్తాల లారీలు పెరిగిపోతుండటంతో వ్యాపారులు, కూలీలు, గుమస్తాలతో మాట్లాడి శనివారం, ఆదివారం కూడా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. యార్డుకు మే 6 నుంచి 40 రోజులు సెలవులని వాటిని 20 రోజులకు తగ్గించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లి, కృష్ణా జిల్లా నందిగామ, ప్రకాశం జిల్లా పర్చూరు, కర్నూలు మార్కెట్ యార్డుల్లో కూడా రూ.1500లు ఇచ్చే పథకం అమలు చేస్తామని చెప్పారు. మిర్చి రైతుల సమస్యల పట్ల దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఇంకా మార్కెట్‌కు రావలసిన మిర్చి చాలా ఉందని మంత్రి చెప్పారు. 85 వేల మంది రైతులు మార్కెట్‌కు రావలసి ఉందని గుర్తించినట్లు తెలిపారు. 
             
కర్నూలులో మిర్చి రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులు మనోధైర్యంతో ఉండాలన్నారు. పత్రికలు కూడా రైతులను ఆందోళనకు గురిచేసేవిధంగా వార్తలు రాయవద్దని కోరారు. ప్రతిపక్షం వారు ఈ సమస్యను రాజకీయంగా చూడవద్దని, రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడవద్దని మంత్రి సోమిరెడ్డి కోరారు. కేంద్రం ప్రకటించిన పథకం ప్రకారం ఎఫ్ఏక్యూ( ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) రకం మిర్చి రూ.5000లకు అమ్మితే వచ్చే నష్టంలో సగం కేంద్ర భరిస్తుందని, అయితే ఆ నష్టం రూ.1250లకి మించకూడదని మంత్రి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీతో సంబంధంలేకుండా అదనపు ధర రైతులకు చెల్లిస్తున్నట్లు తెలిపారు. 
 
రైతులకు మానసికంగా మద్దతు పలకాలి: ఆదినారాయణ రెడ్డి
ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి రైతులకు మానసికంగా మద్దతు పలకాలని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. 30శాతం రైతులకు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనన్నారు.  ప్రతిపక్ష నేత రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం భావ్యంకాదన్నారు. రైతులకు తక్కువ మొత్తంలో జమ అయినట్లు ఒక పేపర్లో రాశారని, అది వాస్తవం కాదని చెప్పారు. నిధులకు కొరతలేదని అదనపు ధర పథకం ప్రకారం రైతులకు వారివారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందిని మంత్రి చెప్పారు. 
 
నిబంధనలు సరళం: ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్
రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చే నిబంధనలు సరళం చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ చెప్పారు. గతంలో రైతులకు మాన్యువల్ గా సర్టిఫికెట్లు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు భూమి వద్దే సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, హార్టీకల్చర్ శాఖల అధికారులు ఈ పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. ఇప్పటికి 300 బిల్లులు చెల్లింపు దశలో ఉన్నాయని, రూ.10 కోట్ల వరకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. నిధులకు కొరత లేదని, ఆఖరి రైతు వరకు డబ్బు చెల్లిస్తారని తెలిపారు. రైతులు ఆందోళనపడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు అనుకూలంగా వ్యవవస్థ పని చేస్తున్నట్లు రాజశేఖర్ చెప్పారు.