శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (10:44 IST)

ఏపీకి ప్రత్యేక హోదా రాదు.. టోక్యోలా అమరావతి నిర్మాణం ఓ కల.. ప్రజలను మోసం చేయొద్దు : వెంకయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదనీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఇదే విషయంపై వాస్తవాలను ప్రజలు వెల్లడించేందుకు ఆర్కేతో ఏబీఎన్‌లో లైవ్‌లో కూర్చొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వెంకయ్య తన మనస్సులోని మాటలను వెల్లడించారు. విభజన రోజున రాజ్యసభలో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ఒక తెలుగోడిగా స్పందించినట్టు చెప్పారు. పైగా విభజన బిల్లులోనే ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని పట్టుబట్టాననీ, కానీ కాంగ్రెస్ పాలకులు తన మాటలు పట్టించుకోలేదనీ ఆరోపించారు. పైగా.. నాడు నేను అడగడమే నేరమన్నట్టుగా నాపై నిందలు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దేశంలో అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయన్నారు. ఇప్పటికే ఉన్న ఆ రాష్టాలవీ బీద అరుపులేనన్నారు. అదేసమయంలో హోదా ఒక్కటే ఇస్తే సరిపోతుందా? ఈ అంశంపై కేంద్రంతో పోరాడటం వచ్చేది ఏమీ లేదన్నారు. అందువల్ల ఏ రాష్ట్రానికి కూడా హోదాను ఇచ్చే పరిస్థితి లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని తనపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. తాను దిగిపోతే ఈ సమస్యకు పరిష్కారమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. హోదాపై ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీ మాటలే ఫైనల్ అని ఆయన చెప్పారు. 
 
నాడు పార్లమెంటులో హోదా ఐదేళ్లు చాలదని, పదేళ్లు కావాలని అడిగింది తానేనని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు తమ ప్రభుత్వం హోదాను మించిన లాభాన్ని దగ్గర చేశామన్నారు. హోదాతో నిమిత్తం లేకుండానే అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఇక సింగపూర్, టోక్యో వంటి నగరాల స్థాయిలో అమరావతిని నిర్మించాలని అనుకోవడం కలేనని చెప్పుకొచ్చారు. 
 
రాజధాని అంటే, ఓ సచివాలయం, ఓ అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసానికి క్వార్టర్లు ఉంటే చాలని, ఆపై అభివృద్ధి నిదానంగా సాగుతుందన్నారు. 20 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని మించిన నగరాన్ని నిర్మిస్తామని ప్రజలను మోసం చేసే మాటలు చెప్ప వద్దని తెలుగుదేశం పార్టీకి హితవు పలికారు. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్‌తో అమరావతిని పోల్చవద్దని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, అమరావతిపైనే దృష్టిని సారించరాదని సలహా ఇచ్చారు.