శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (15:14 IST)

'వెంకన్న'పై కన్నేసిన సుబ్రమణ్య'స్వామి'.. తిరుమల శ్రీవారిపై మీ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్న బీజేపీ ఎంపీ!

సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తూ సంచలనం సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఇపుడు తిరుమల వెంకన్నపై దృష్టిసారించారు.

సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తూ సంచలనం సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఇపుడు తిరుమల వెంకన్నపై దృష్టిసారించారు. సూటూబూటు వేసే కేంద్ర మంత్రులను వెయిటర్లతో పోల్చగా, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ సగం భారతీయుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. 
 
ఈ నేపథ్యంలో.. తిరుమల వెంకటేశ్వర స్వామిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించారు. టీటీడీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆలయాలను ఏ ప్రభుత్వం కూడా మూడేళ్లకు మించి తమ ఆధీనంలో ఉంచుకోకూడదని స్వామి తెలియచెప్పారు. దేశంలోని ఆలయాలకు ప్రభుత్వాల గుత్తాధిపత్యం నుంచి విముక్తి కల్పించాలని ఆయన కోరారు. ఆలయాల నిర్వహణకు ధార్మిక సంస్థలు ముందుకు రావాలని స్వామి కోరారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేసి గెలుస్తానని స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షంగా ఉంది. ఇపుడు ఇదే పార్టీ తరపున ఎంపీగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.