గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (12:17 IST)

ప్రాణం తీసిన హనీమూన్... గుండె తక్కువగా కొట్టుకునే మాత్రలు మింగి...

ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్ళి వచ్చింది. హనీమూన్‌కు అయిన ఖర్చులు ఇవ్వమని మామను అల్లుడు అడిగాడు. తాను ఇవ్వనంటే ఇవ్వనని తెగేసి చెప్పడంతో భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధించాడు. ఆ వేధింపులు భరించలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోదాడకు చెందిన డాక్టర్‌ గురువయ్య తన రెండో కుమార్తెను అల్వాల్‌ వెస్ట్‌ వెంకటాపురం ప్రాంతానికి చెందిన రాజేశ్వర్‌ రావు కుమారుడు కార్తీక్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో పెళ్లి చేశాడు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల నగదు, 45 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి ఆభరణాలు ఇచ్చారు. 
 
ఆ తర్వాత నవ దంపతులు హానీమూన్‌ కోసం స్వదేశంతో పాటు విదేశాలకు వెళ్లారు. ఇందుకోసం బాగానే డబ్బు ఖర్చు చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హానీమూన్ కోసం రూ.25 లక్షలు ఖర్చు అయిందనీ దాన్ని తిరిగి ఇవ్వాలంటూ మామ గురవయ్యను అల్లుడు కార్తీక్ అడిగాడు. అయితే, ఆ డబ్బు ఇవ్వనని గురవయ్య తేల్చి చెప్పాడు. 
 
అప్పటి నుంచి కార్తీక్‌, మామ రాజేశ్వర్‌ రావు, అత్త బానుమతి జయశ్రీని వేధించడం ప్రారంభించారు. కట్నం కోసం వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్రమనస్థాపం చెందిన జయశ్రీ గుండె తక్కువ కొట్టుకునే మందులు మింగింది. దీంతో జయశ్రీ ఒక్కసారిగా పడిపోవడంతో భర్త కార్తీక్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. 
 
భర్త కార్తీక్‌, మామ రాజేశ్వర్‌రావు, అత్త భానుమతిలు అదనపు కట్నం కోసం వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి గురవయ్య అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.