శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 8 జులై 2015 (06:45 IST)

సార్‌...భ‌ద్ర‌త క‌రువ‌య్యింది...! ఏపీ కార్యాల‌యాల‌కు తాళాలు వేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తికి టిడిపి ఫిర్యాదు

సార్ భ‌ద్ర‌త క‌రువ‌య్యింది... ఏపీ కార్యాల‌యాల‌కు బ‌ల‌వంతంగా తాళాలు వేస్తున్నారు. ఇక్క‌డ ఏ మాత్రం ర‌క్ష‌ణ లేదు. ఉద్యోగుల‌ను బ‌ల‌వంతంగా పంపించి వేస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వంపై తెలుగుదేశం నాయ‌కులు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు భద్రత కరువైందని ఏపీ సర్కారు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మంగళవారం వేర్వేరుగా రాష్ట్రపతిని కలిశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 8 అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌ శివారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, రావెల కిషోర్‌ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కింజరపు అచ్చెన్నాయుడు కలిశారు. 
 
సెక్షన్‌ 8తోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ‘‘ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్‌ అనేది గతంలో ఎక్కడా లేదు. అయితే... ఏపీ రాష్ట్ర విభజనతో దేనినీ పోల్చలేం. అందుకే గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించారు. కానీ, సెక్షన్‌ 8 ఉమ్మడి రాజధానిలో అమలు కావడం లేదు. అందువల్ల ఇక్కడ ఉంటున్న ఏపీ ప్రజలకు రక్షణ, భద్రత కరువయ్యాయి’’ అని తెలిపారు. 
 
ప్రజలను సెటిలర్లు, ఆంధ్రోళ్లు అంటూ అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారులను సైతం పలు రకాలుగా అవమానించారని వివరించారు. ఉమ్మడి సంస్థల్లో ఏపీకి చెందిన నిధులను విడుదల చేయకుండా బ్యాంకులను హెచ్చరించారని.. ఇవన్నీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని రాష్ట్రపతికి తెలిపారు. ఉద్యోగుల పంపిణీ జరగక ముందే ఏపీ ఉద్యోగులను బలవంతంగా పంపించి వేస్తున్నారని వివరించారు. ఏపీ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాలకు బలవంతంగా తాళాలు వేసి వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.