శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:02 IST)

సస్పెండ్.. క్షమాపణకు డిమాండ్: నరరూపరాక్షసుడన్నారు.. జగన్!

బఫూన్ వ్యాఖ్యలపై వైకాపా అధినేత జగన్ ప్రతిస్పందించారు. ఇదే సభలో టీడీపీ సభ్యులు తనన హంతకుడు అన్నారని...నరరూపరాక్షసుడు అన్నారన్నారు. తమ ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అని కూడా అన్నారని జగన్ వ్యాఖ్యానించారు. 
 
తనను అలాంటి ఘోరమైన మాటలతో దూషించిన తర్వాత... తాను కేవలం వారిని బఫూన్లు అన్నానని వైఎస్ జగన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒక్క మాటకే టీడీపీ నేతలు ఇంతలా పెద్ద హంగామా చేస్తున్నారని, తనను నానా మాటలన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
బఫూన్లంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అధికార పార్టీ మండిపడింది. గౌరవ సభ్యులను అవమానించిన జగన్‌ను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. బఫూన్లంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలన్నారు.
 
జగన్ క్షమాపణ చెప్పాలి లేదా ఆయనను సభ నుండి బయటకు పంపించాలని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఒక ఆర్థిక ఉన్మాది శాసనసభకి వస్తే ఎలా ఉంటుందో జగన్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు. జగన్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.
 
జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని, వైయస్ హయాంలో లక్ష కోట్లు జగన్ తిన్నారని, చంద్రబాబును కూడా వైయస్ అనుచరులు చంపాలని చూశారని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మండిపడ్డారు. 
 
16 నెలలు జైలులో చిప్పకూడు తిన్న తర్వాత కూడా జగన్‌కు బుద్ధి రాలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ కన్నా పెద్ద బఫూన్ ఎవరూ లేరన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో శాసనసభలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదన్నారు. 
 
మరోవైపు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. అయినా సభలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు.