శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (17:13 IST)

అక్రమ కట్టడంలో కలెక్టర్ల సదస్సా? ప్రజా వేదిక ప్రజల ఆస్తి

అమరావతిలో కృష్ణానది తీరంలో గత టీడీపీ ప్రభుత్వం రూ.8 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను నిర్మించింది. ఇది నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి అతి సమీపంలో ఉంది. అంటే చంద్రబాబు తన నివాసం నుంచి ప్రజలతో కలిసేందుకు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రజా వేదికను నిర్మించారు. 
 
అయితే, కృష్ణా నదీతీరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో కృష్ణా రివర్ బేసిన్ స్పష్టం చేసింది. అలాగే, పర్యావరణ శాఖ, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం కరకట్టకు సమీపంలో శాశ్వత నిర్మాణాలకు అడ్డు చెప్పింది. కానీ, గత ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా రూ.8 కోట్ల వ్యయంతో ఈ ప్రజావేదికను నిర్మించింది. 
 
అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. ఇందులోభాగంగా, అక్రమ నిర్మాణమైన ప్రజా వేదిక నుంచే కూల్చివేత ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ప్రజా వేదికకా జరిగిన కలెక్టర్ సదస్సు నుంచి ఆయన అధికారులను ఆదేశించారు. 
 
సీఎం జగన్ ఆదేశాలపై టీడీపీ నేతలు స్పందించారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ప్రజా వేదిక అని, అది ప్రభుత్వ, ప్రజా ఆస్తి అని గుర్తుచేశారు. పైగా, ఈ భవనాన్ని చట్టపరంగానే అన్ని అనుమతులతో నిర్మించారని గుర్తుచేశారు. 
 
పైగా, ప్రజా వేదిక ఓ అక్రమ కట్టడం అంటూనే కలెక్టర్ల సదస్సును ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రజా వేదికను తమ పార్టీకి కేటాయించాల్సి వస్తుందనే కూలగొట్టాలని కక్షపూరిత నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.