శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (09:18 IST)

ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమే : సెంటిమెంట్‌ను గౌరవిస్తూ టీడీపీ దూరం!

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధికార టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో ఇక్కడ నుంచి వైపాకా తరపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి దివంగత శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. 
 
ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ దాఖలు చేయాల్సి వుంది. ఇప్పటి వరకు వైకాపా అబ్యర్థి అఖిల ప్రియా రెడ్డి మాత్రమే నామినేన్ పత్రాలను సమర్పించారు. బరిలో నిలిచి ఉంటామన్న కాంగ్రెస్, టిడిపి పార్టీలు గత సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకుని పక్కకు తప్పుకున్నాయి. 
 
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ మహిళా నేత శోభానాగిరెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 14న ఆళ్లగడ్డ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. 17వ తేదీన శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ నామినేషన్ వేశారు. పదవిలో ఉన్న ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసినా బరిలో నిలవకూడదన్న సంప్రదాయానికి టీడీపీ, కాంగ్రెస్ కట్టుబడ్డాయి. ఇటీవల నందిగామలో టీడీపీకి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపినట్లుగానే ఆళ్లగడ్డలో వైసీపీకి తెలుగుదేశం మద్దతు తెలిపి ఎన్నిక బరి నుంచి తప్పుకుంది.