శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (14:56 IST)

నల్గొండలో టీడీపీ బంద్: ఎర్రబెల్లి, రేవంత్, మోత్కుపల్లి అరెస్ట్

నల్గొండలో జరిగిన టీడీపీ బంద్‌లో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలో టీడీపీ ఆఫీసుపై టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు మంగళవారంనాడు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్‌ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 
 
సూర్యాపేటలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఈ అప్రజాస్వామ్య పాలనను ధీటుగా ఎదుర్కొంటామని రేవంత్‌ రెడ్డి చెప్పారు.
 
కాగా చిట్యాల పోలీసు స్టేషన్‌ వద్ద తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. బంద్‌ పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. 
 
బంద్‌లో పాల్గొనడానికి వెళ్తున్న ఎర్రబెల్లి, రమణ, మోత్కుపల్లి ప్రభృతులను చిట్యాలలో పోలీసులు అరెస్టు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. అలాగే చౌటుప్పల్‌ మండలం కొత్తగూడెం వద్ద రేవంత్‌, రమేష్‌ రాథోడ్‌ ప్రభృతులను అరెస్టు చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే కరెంటు వస్తుందా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ముందుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఆ ముందు చూపు ప్రదర్శించలేకపోయారని మోత్కుపల్లి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని ప్రోత్సహించిన జగదీశ్వర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.