శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (12:26 IST)

తెలంగాణలో పదిమంది ఐఏఎస్ అధికారుల బదిలీ!

తెలంగాణ ప్రభుత్వం పదిమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా జిడి ప్రియదర్శన్‌ను నియమించారు. ప్రస్తుతం అక్కడ కలెక్టర్‌గా ఉన్న గిరిజాశంకర్‌ను బదిలీ చేసినప్పటికీ ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. 
 
ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఎలంబర్తిని నియమించారు. ప్రస్తుతం అక్కడ కలెక్టర్‌గా ఉన్న ఐ శ్రీనివాస్ శ్రీ నరేశ్‌ను బదిలీ చేసింది. జిహెచ్‌ఎంసి వెస్ట్ జోన్ కమిషనర్‌గా పని చేస్తున్న డి రోనాల్డ్ రోస్‌ను నిజామాబాద్ కలెక్టర్‌గా నియమించారు. 
 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె రేమండ్ పీటర్‌కు అపార్డు డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతంను అక్కడి నుంచి బదిలీ చేసింది.
 
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న అమరపాలి కటాను అక్కడి నుంచి బదిలీ చేసి మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న జె నివాస్‌కు ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించింది. 
 
జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌గా పని చేస్తోన్న డాక్టర్ ప్రీతి మీనాను నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జాయింట్ కలెక్టర్‌గా ఎం హరి నారాయణను నియమించింది. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ డి వెంకటేశ్వర్‌రావును బదిలీ చేసింది.