శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (06:37 IST)

అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధాని.. ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ

ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి పాలన సాగించడం సాధ్యం కాదని, మూడు రోజుల పాటు ఏపీలోనే ఉండి పాలన సాగిద్దామని ‌రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి సూచించారు. అదే సమయంలో అమరావతికి సమీపంలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశం తరువాత దీనిపై సీఎస్‌ ఆదేశాలు జారీచేశారు.
 
గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకప్ప, ఆర్‌అండ్‌బీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా చీఫ్‌ ఇంజనీరు, మునిసిపల్‌ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. 
 
మరోవైపు, అంతర్జాతీయ స్థాయి రాజధాని నగర నిర్మాణానికీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కమిటీనే తాత్కాలిక రాజధాని విషయంలో పరిశీలన జరుపుతుంది. ఎక్కడెక్కడ ఏ కార్యాలయాలు ఉండాలి అనే అంశాన్ని పరిశీలించి వీలైనంత ఎక్కువగా ప్రజలకు పాలన దగ్గరగా ఉండేలా చూస్తారు.