గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (18:39 IST)

జనసేనలోకి ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధరం.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్

సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో వుండి, ఎమ్మెల్సీగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి.. ప్రస్తుతం ఏపీసీసీ ఉపాధ్యక్షుడైన మాదాసు గంగాధ‌రం.. కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. గంగాధరంను సాదరంగా పార

సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో వుండి, ఎమ్మెల్సీగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి.. ప్రస్తుతం ఏపీసీసీ ఉపాధ్యక్షుడైన మాదాసు గంగాధ‌రం.. కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. గంగాధరంను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు. ఈ మేరకు జనసేన ఆవిర్భావ మహాసభను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు పార్టీ నుంచి ప్రెస్ నోట్ విడుదలైంది. 
 
ఈ ప్రెస్‌నోట్‌లో తనకు 30 ఏళ్ల నుంచి గంగాధరంతో పరిచయం ఉందని పవన్ చెప్పారు. గంగాధరం సలహాలు, అనుభవం తమ పార్టీకి అవసరమని పవన్ ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించామని పవన్ తెలిపారు. ఇంకా ఈ నెల 14న గుంటూరులో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ పర్యవేక్షకులుగా గంగాధరంకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. 
 
గంగాధరం మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా వున్నానని, జనసేనాని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. పవన్‌లోని నిబద్ధత గురించి తనకు తెలుసునని.. వారి తండ్రి వెంకట్రావు గారితో నెల్లూరులో ఉద్యోగం చేస్తున్న నాటినుంచే పరిచయమని.. వారి కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 
 
అలాగే పవన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా వుందని.. పార్టీలో ప్రతి కార్యకర్తకి సోదరుడిగా అండగా వుంటానని.. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారమే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్... మాదాసు గంగాధరానికి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు. 
 
కాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ నెల 14వ తేదీన  గుంటూరు, నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా, టోల్ ప్లాజాకు సమీపంలో జరుగనుంది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ సభ జరుగుతుందని జనసేనాని ప్రకటించారు.