శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (08:12 IST)

బిస్కెట్.. బిస్కట్.. మత్తులో దంపతులు.. నిలువుదోపిడీ చేసిన దొంగలు

మాట మాట కలిసింది. మీది తెనాలే.. మాది తెనాలే అనుకున్నారు. మాయచేసి బిస్కెట్లిచ్చి భార్యాభర్తలను మత్తులోకి జోకొట్టారు. తరువాత ఒంటిపై ఉన్న బంగారం ఒలుచుకున్నారు. జేబులో ఉన్న నగదు కాజేశారు. స్టేషన్ రాగానే చక్కగా జారుకున్నారు. విజయవాడ రాయగ పాసింజర్ లో శుక్రవారం జరిగిన సంఘటనలో దొంగలు 5 తులాల బంగారం, ఆరువేలు నగదు. సెల్ ఫోన్ దోచుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
విజయవాడ జెండా వీధికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మీమాణిక్యమ్మ(55) దంపతులు సామర్లకోట వచ్చేందుకు శుక్రవారం విజయవాడ-రాయగడ (57271) పాసింజర్‌ ఎక్కారు. వారితోపాటే ప్రయాణిస్తున్న వ్యక్తి మాటలు కలిపాడు. రాజమండ్రి దగ్గర అతను వారికి టీ, బిస్కెట్లు ఇచ్చాడు. టీ తాగిన కొద్దిసేపటికి దంపతులు మత్తులోకి జారుకున్నారు. మత్తు నుంచి కాస్త బయటపడేసరికి రైలు విశాఖ చేరుకుంది. మాణిక్యమ్మ మెడలోని పుస్తెలతాడు, సూర్యనారాయణ జేబులో పర్సు కనిపించలేదు. 
 
ఖంగుతున్న దంపతులు జరిగిన ఘటనపై విశాఖ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు పూర్తిగా మత్తు నుంచి బయటపడకపోవడంతో రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఇదే రైల్లో ఉన్న గుడివాడకు చెందిన నవీన్‌ కూడా మత్తు దొంగల బారినపడ్డాడు. మత్తులోకి జారుకోగానే అతని వద్ద వున్న రూ.5800 నగదును దొంగిలించాడు.
 
ఇదిలా వుండగా కూర్బా నుంచి విశాఖ వస్తున్న రైల్లో దొంగతనానికి పాల్పడుతూ మత్తు దొంగ ఒకరు ఆర్పీఎఫ్‌ సిబ్బంది చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. మత్తునిచ్చే టీ తాగిన ఒక మహిళ విశాఖ చేరుకున్న వెంటనే స్పృహవచ్చి ప్లాట్‌ఫాంపై పెద్దగా కేకలు వేయడంతో గస్తీ కాస్తున్న ఆర్పీఎఫ్‌ స్పెషల్‌ టీమ్‌ మండల్‌ అనే వ్యక్తిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం.