శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (18:03 IST)

అనుమ‌తిలేని ర్యాలీ..రెచ్చ‌గొట్టే ప్ర‌సంగం..మార‌ణాయుధాల ప్ర‌ద‌ర్శ‌న...రేవంత్‌పై మ‌రోమూడు కేసులు...

తెలంగాణ ప్ర‌భుత్వం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని విడిచిపెట్టేలా లేదు. రేవంత్‌పై మ‌రోమూడు కేసులు నమోదయ్యాయి. ముంద‌స్తు అనుమ‌తి లేని ర్యాలీ నిర్వ‌హించార‌నీ, అలాగే రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేశార‌నీ, మార‌ణాయుధాలు చూపార‌నే మూడు సంఘ‌ట‌న‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం విశేషం. రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ధీటుగానే స‌మాధానం చెప్పింది. 
 
ఓటుకు నోటు వివాదంలో నిన్ననే బెయిల్‌పై విడుదలైన రేవంత్‌రెడ్డి, చర్లపల్లి జైలు నుంచి భారీ ర్యాలీతో హంగామా చేసిన విషయం విదితమే. చర్లపల్లి జైలు నుంచి బయటకు వస్తూనే కొందరు అభిమానులు ఆయనకు ‘కత్తి’ బహూకరించడంతో, దాన్ని ఆయన ప్రదర్శించారు. అయితే రాజకీయాల్లో డూపు కత్తుల్ని నాయకులకు అభిమానులు ఇవ్వడం, వాటిని నాయకులు ప్రదర్శించడం సహజమే.
 
కానీ సాధార‌ణ ప‌రిస్థితుల‌లో వేరు. కానీ ర‌గులుతున్న స‌మ‌యంలో కేసు పెట్ట‌డానికి సాకు చాలు. రెచ్చగొట్టే ప్రసంగాల విషయానికొస్తే.. ఆయన వాడిన ‘సన్నాసి’ భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేసీఆర్‌కి మాత్రమే పేటెంట్‌ అయిన పదజాలంతో రేవంత్‌ ఒకింత ఓవర్‌గానే నోరు పారేసుకున్నారు. దీనిని రెచ్చ‌గొట్టే భాష కింద లెక్క‌గ‌ట్టి మ‌రో కేసు న‌మోద‌య్యింది. 
 
ఇక జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆయ‌న నిర్వ‌హించిన ర్యాలీకి ముందస్తు అనుమ‌తి లేదు. రాజకీయాల్లో ఇదీ సర్వసాధారణమైన వ్యవహారమే. అయినా సరే, రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వివాదంలో నిండా కూరుకపోయి, షరతులతో కూడిన బెయిల్‌ని పొంది బయటకు వచ్చారు. ఈ స‌మ‌యంలో కిమ్మ‌న‌కుండా ఇల్లు చేరాల్సిన ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై పోలీసులు మ‌రో కేసు న‌మోదు చేశారు. అసలే ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయి, అందులోంచి ఎలా బయటకు రావాలో తెలియక సతమతమవుతోన్న రేవంత్‌రెడ్డికి ఈ కేసులు మూలుగుతున్న న‌క్క‌పై తాటిదెబ్బ కాక త‌ప్ప‌దేమో...