బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (09:17 IST)

విజయవాడలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

విజయవాడ నగర శివారులో అర్థరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనులకు ఏర్పాటు చేసిన జాకీలను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 
 
కండ్రిక నుంచి పాతపాడు వెళ్లే రహదారిపై ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వాంబే కాలనీకి చెందినవారీగా పోలీసులు గుర్తించారు. 
 
ఈ భీకర ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కండ్రిక ప్రాంతం నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో కొత్తగా వంతెన నిర్మిస్తున్నారు. దానికి ఐరన్ రాడ్స్ ఉన్నాయి. 
 
అయితే, ముగ్గురు యువకులు పల్సర్ బైక్‌పై అతి వేగంగా వెళ్లి ఆ రాడ్స్‌ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలై ఆ తర్వాత అక్కడే ప్రాణాలు విడిచారు. 
 
చనిపోయిన ముగ్గురు యువకులూ విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన రాజు, రమణ, సింహాచలంగా గుర్తించారు. అతి వేగంతో రహదారి డైవర్షన్ చూసుకోకుండా బైక్‌ను నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
 
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ముగ్గురు యువకుల మృతి నేపథ్యంలో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. 
 
వారి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. చేతికందివచ్చిన కొడుకులు కళ్లముందే మృత్యువాత పడటంతో వారి రోధన ఆకాశన్నింటింది. అది చూసి స్థానికులు సైతం చలించిపోయారు.