శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (16:45 IST)

స్మార్టు.. ఆధ్యాత్మిక కేంద్రాలుగా తిరుపతి తిరుమల : ఈవో సాంబశివరావు

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తిరుమల తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుతామనీ, తిరుపతిని స్మార్టు సిటీగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుందని ఈవో డి.సాంబశివరావు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాలను స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని పారిశుధ్యం, వసతుల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగతుందన్నారు. అదే సమయంలో ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బ తినకుండా మరింత ఇనుమడింప బడే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో బుధవారం మధ్యాహ్నం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతలు స్వీకరించారు. 
 
కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన 1.30 గంటల ప్రాంతంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రస్తుత ఈవో గోపాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి పట్టణంలో మిళితమైన వాతావరణం నెలకొనే విధంగా చేస్తామన్నారు. ఒకవైపు స్మార్టు సిటీగా తిరుపతిని తీర్చిదిద్దుతూనే అదనంగా ఆధ్యాత్మిక నగరంగా కూడా రూపొందిస్తామన్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వాతావరణం ఉండదని చెప్పారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే భక్తులకు నమ్మకం ఉందనీ, ఎలాంటి కార్యక్రమాలనైనా చక్కగా నిర్వహించగలదనే భావన భక్తులలో ఉందన్నారు. అయితే ఆ నమ్మకాన్ని మరింత పెంచుతామని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులలో శక్తిని వెలికి తీసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. అయితే ఎక్కడా నియమనిబంధనలను విస్మరించే ప్రసక్తి లేదన్నారు. అతిక్రమించేది ఉండదన్నారు. నిబంధనలకు లోబడే కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
 
విమర్శలను స్వీకరిస్తూనే వాటిలోని మంచిని గ్రహించి చెడును విస్మరిస్తామని చెప్పారు. మంచిని పెంచుతూ, చెడును తగ్గించడమే తమ పని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీనివాస రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.