శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 6 మే 2016 (13:57 IST)

'బార్క్' సిబ్బందికి లంచం ఎర : రేటింగ్ మీటర్లున్న 10 ఇళ్ళు చెబితే రూ. 5 లక్షలు

టీవీ రేటింగ్స్ లెక్కించే టామ్ మీటర్లు తెలుసుకొని కొన్ని చానల్స్ అక్రమంగా రేటింగ్స్ కొనుక్కుంటున్నట్టు గతంలో అనేక ఆరోపణలున్నాయి. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) స్వయంగా తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఢిల్లేలో డిజిటైజ్ ఇండియా పేరుతో జరుగుతున్న ఒక సదస్సు సందర్భంగా బార్క్ సీఈవో పార్థోదాస్ గుప్తా ఈ విషయం వెల్లడించారు. ఏ శాంపిల్ ఇళ్ళలో మీటర్లు పెట్టారో చెప్పవలసిందిగా కోరుతూ లంచం ఇవ్వజూపినట్టు చెప్పారు.
 
నిజానికి గడిచిన ఏడు నెలలకాలంలో చాలామంది ఆ మీటర్ల ఆచూకీ తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెబుతూనే నిర్దిష్టంగా ఒక సంఘటనను వివరించారు. పది ఇళ్ళు చెప్పమని అడుగుతూ లక్ష రూపాయలు ఇచ్చి, మరో నాలుగు లక్షలు కూడా  ఇస్తామని తమ సిబ్బందికి చెప్పారన్నారు. అయితే ఆ చానల్ పేరు చెప్పటానికి ఆయన నిరాకరించారు. డిష్ టీవీ ఎండీ జవహర్ గోయెల్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధనమిస్తూ పార్థోదాస్ గుప్తా ఈ దిగ్భ్రాంతికరమైన విషయం బైటపెట్టారు.
 
ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకే ఏటా కనీసం 25 శాతం ఇళ్లలో మీటర్లు మార్చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం బార్క్ 22 వేల ఇళ్ళలో 25 వేల మీటర్లు పెట్టిందని తెలియజేశారు. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ టీవీ సెట్లు కూడా ఉండటంతో అందుకు అనుగుణంగానే శాంపిల్ నిర్ణయించటం వల్ల ఇళ్ళకంటే మీటర్లు ఎక్కువ ఉన్నాయన్నారు.
 
మరో సంఘటనలో ఒక టీవీ చానల్ సిబ్బంది బార్క్ మీటర్లున్న ఇళ్ళకు వెళ్ళి తమ చానల్ కార్యక్రమాలు చూడవలసిందిగా కోరుతూ లంచాలు ఇవ్వజూపుతున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. చానల్ పేరు వెల్లడించకపోయినా ఒక దక్షిణ భారత నగరమని మాత్రం చెప్పారాయన. అలాంటి చానల్స్ పేర్లు వెల్లడించి వాటి బండారం బైట పెట్టాలని కోరగా, పూర్తి స్థాయి ఆధారాలతో బైట పెట్టటానికి అభ్యంతరం లేదని, ఆధారాల కోసమే ఆగామని చెప్పారు. “ ఒక మెట్రో నగరంలో బార్క్ పానెల్ ఇళ్ళు 100 ఉన్నాయంటూ వాటి జాబితా బయటపెట్టి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాటిలో ఏడు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. వెంటనే ఆ ఏడింటినీ మార్చేశాం. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మకండి” అన్నారు.
 
మొదట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెబుతూ విజిలెన్స్ విభాగాలు ఏర్పాటు చేయటం ద్వారా సొంత సిబ్బందిమీద కూడా నిఘాపెట్టామన్నారు. ఎక్కడైనా సమాచారం అసాధారణంగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఇళ్లు మార్చటం లాంటి చర్యలు తీసుకుటున్నట్టు వెల్లడించారు. అయితే కేబుల్ ఆపరేటర్, ఎమ్మెస్వో తమ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎన్ని మీటర్లున్నాయో తెలుసుకొని వాటి సంఖ్య ఆధారంగా కారేజ్ ఫీజు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారన్న విషయం మీద పార్థోదాస్ గుప్తా నిస్సహాయత వ్యక్తం చేశారు. మీటర్ అనేది భౌతికంగా కనబడే వస్తువు కాబట్టి దాన్ని దాచిపెట్టటం కుదరదని, రోజూ చందాదారుతో ప్రత్యక్ష సంబంధం ఉండే ఆపరేటర్/ఎమ్మెస్వో ను అడ్డుకోవటం సాధ్యం కాదన్నరు.
 
ఏ ఒక్క ఇంట్లోనైనా ఒకే చానల్ ఎక్కువ చూస్తున్నట్టు తేలినా, డేటా అసాధారణంగా అనిపించినా ఆ ఇంటిని కొంతకాలం పరిశీలనలో ఉంచి అవసరాన్నిబట్టి తొలగిస్తామన్నారు. గ్రామాల కంటే పట్టణ ప్రామ్తాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు అంగీకరించారు. 70 శాతం మీటర్లు  పట్టణ ప్రాంతాల్లో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 30 శాతమే ఉన్నట్టు చెప్పారు. అయితే, గతంలో గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా పట్టించుకోకపోవటాన్ని గుర్తుచేశారు.గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక వైవిధ్యం తక్కువగా ఉండటం వల్లనే తక్కువ శాంపిల్ తీసుకుంటున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు.
 
రేటింగ్స్ విషయంలో టీవీ పరిశ్రమ ఒక మహత్తరమైన అవకాశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెట్ టాప్ బాక్సులలో ఒక చిన్న చిప్ అమర్చటం ద్వారా సర్వే పద్ధతికి బదులు పూర్తి సమాచారం రాబట్టే వీలుండగా ఆ విషయాన్ని పట్టించుకోకపోవటం వల్లనే ఇప్పుడు తప్పనిసరిగా ఇలా మీటర్లు పెట్టాల్సి వస్తోందన్నారు.  రిటర్న్ పాత్ బాండ్ విడ్త్ కోసం ఖర్చు చేస్తే సరిపోయే పరిస్థితిని చేజార్చుకున్నామన్నారు. ఇప్పటికైనా ఆ అవకాశాల గురించి పరిశీలించాలని దాస్ గుప్తా విజ్ఞప్తిచేశారు.