శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (12:25 IST)

చదువులమ్మ ఒడి నుంచి... మృత్యు ఒడికి

కూలీ పని చేసి చదువుకోవాలకున్న ఓ విద్యార్థి... చదువు తప్ప మరో ప్రపంచం తెలియని ఇంకో విద్యార్థినీ.. చదవుకోసమే పరుగులు పెడుతూ.. చదువు కోసమే ముందుకు నడుస్తున్న వీరిని మృత్యువు వాహన రూపంలో వెంటాడింది. తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. వీరి నేపథ్యం తెలిసిన వారు కంటతడిపెడుతున్నారు. గంపెడాశతో.. బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ కాలం గడిపిన వారు విగత జీవులుగా మారారు. చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
యాదమరి మండలం కొట్టాలకు చెందిన శ్రీనివాసులు, కమలమ్మ రెండో కుమారుడు అజయ్ (16). ఊహ తెలిసే నాటికే తండ్రి చనిపోయాడు. నిరుపేద కుటుంబం. ఉండడానికి సొంత ఇళ్లు కూడా లేదు. తల్లి కూలి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. అయితే స్థితికి పేదవాడే కానీ అజయ్ చదవులో చాలా ధనికుడు కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో 9.2 మార్కులతో పదో తరగతి పాసయ్యాడు. ఇంజనీరయ్యి పేదరికాన్ని జయించాలని ఎంపీసీలో చేరాలనుకున్నాడు. 
 
కళాశాల ఫీజు కట్టలేక కూలి పనికి వెళ్ళాడు. మంగళవారం రూ.1,500 ఫీజు చెల్లించాడు. బుధవారం మరో రూ.వెయ్యి చెల్లించి హాల్‌టికెట్టు తీసుకోవడానికి కళాశాలకు వచ్చాడు. అదే సమయంలో వార్షికోత్సవం జరుగుతోంది. రూ.200 చెల్లించలేదని అతనికి వార్షికోత్సవంలోకి అనుమతించలేదు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కడానికి బస్టాండుకు వెళుతున్నాడు. అయితే వాహన రూపంలో వచ్చిన మృత్యువు వెంటాడింది.
 
వాహనం అజయ్‌ను ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావం మధ్య అజయ్‌ను స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా. నేను బతుకుతానా..? మా అమ్మను చూడాలి... అంటూనే కళ్లుమూశాడు. ఆస్పత్రిలో నిర్జీవంగా పడివున్న అజయ్ మృతదేహాన్ని చూసిన ఇతని తల్లి గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కలచివేసింది.
 
ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. చిత్తూరు గ్రామీణ మండలం మర్రికుంటకు చెందిన నాగరత్నరాజు, రత్నమ్మ రెండో కుమార్తె హంస (21) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. తాను.. తన చదువు.. కొందరు స్నేహితులు తప్ప హంసకు మరే ప్రపంచం తెలియదు. నెల రోజులుగా జ్వరంతో కళాశాలకు వెళ్లని హంస బుధవారం  కళాశాకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తూ వ్యాన్ కింద పడి అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది.  ఈ రెండు సంఘటనలు చిత్తూరు వాసులను కలిసి వేశాయి.