శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (12:34 IST)

చంద్రబాబు పనితీరు భేష్.. విమర్శించొద్దు.. రాజకీయం వద్దు : వీహెచ్

కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. హుదూద్ తుఫాను సహాయక చర్యల్లో చంద్రబాబు పనితీరు అద్భుతంగానూ, ప్రశంసనీయంగా ఉందని అందువల్ల ఆయనను విమర్శించవద్దని సహచర కాంగ్రెస్ నేతలకు హితవుపలికారు. హుదూద్ తుఫాను సహాయక చర్యలను చంద్రబాబు సమర్థవంతంగా చేపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ముందు జాగ్రత్తల వల్లే ప్రాణ నష్టం భారీగా తగ్గిందన్నారు. 
 
ఇకపోతే.. మహారాష్ట్ర, హర్యానాల్లో వెలువడుతున్న ఫలితాలపై స్పందిస్తూ... ఈ రెండు రాష్ట్రాల్లో పదేళ్లకు పైగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, సహజంగానే అక్కడి ప్రజలు మార్పును కోరుకున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీపై వారికి వ్యతిరేకత లేదని అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చూద్దామని ఓటర్లు భావించారని చెప్పారు. 
 
కొత్తగా పెళ్లయిన వాడు సాయంత్రం 8 గంటలకే ఇంటికి వెళతాడని... ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నెమ్మదిగా వెళతాడని... ఇదీ అంతేనని ఉదాహరణగా చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకే తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారని... ఆయన పర్యటను రాజకీయం చేయవద్దని కోరారు.