శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (14:30 IST)

విజయవాడ.. న్యూయార్క్ స్థాయికి చేరింది : వెంకయ్య నాయుడు

భూముల ధర విషయంలో విజయవాడ.. న్యూయార్క్ స్థాయికి చేరుకున్నటుందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలపై ఓ సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ దుస్థితి చూస్తే బాధ కలుగుతోందన్నారు. 
 
రెండు నెలలుగా ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో విజయవాడ నగర పాలక సంస్థ ఉందన్నారు. మెరుగైన పరిపాలన వ్యవస్థ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నారు. పన్నులు వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నగరపాలక సంస్థకు పరోక్షంగా ఆయన  సెలవిచ్చారు. 
 
ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా పన్నులు కడతారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే పన్నులు కట్టడానికి ప్రజలు వెనుకాడరన్నారు. సరైన ప్రణాళిక ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అలాగే, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) మెట్రో రైలు తన కల అని, దీన్ని నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 
 
ఇకపోతే ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రాంతంలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పారు. అయితే, రియల్టర్ల వలలో ప్రజలు పడి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే రాష్ట్రంలోని ప్రజలకు అంత కొనుగోలు శక్తి లేదని రియల్టర్లు తెలుసుకోవాలన్నారు. దళారుల మాయలో పడి భూముల కొనుగోలు విషయంలో ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు. శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతానికి వెళ్తే... ఆ ప్రాంతంలో భూముల ధరలకు ఇష్టం వచ్చినట్లు రెక్కలొచ్చేశాయని ఆయన విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన గొప్ప 'మేలు' అదేనన్నారు.