మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 23 ఆగస్టు 2017 (17:41 IST)

26న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పౌర సన్మానం( ఏర్పాట్ల ఫోటోలు)

అమరావతి: ఈ నెల 26వ తేదీ శనివారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘనంగా పౌరసన్మానం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం

అమరావతి: ఈ నెల 26వ తేదీ శనివారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘనంగా పౌరసన్మానం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి పర్యటన వివరాలు తెలిపారు. 26వ తేదీ ఉదయం 9.10 గంటలకు ఉప రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. గవర్నర్ నరశింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారని తెలిపారు. 
 
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నందున ఓపెన్ టాప్ జీపులో వెలగపూడిలోని శాసనసభ, సచివాలయ భవనాల వద్దకు 10.40 గంటలకు చేరుకుంటారన్నారు.  జీపులో ఆయన వెంట గవర్నర్, సీఎం ఉంటారని చెప్పారు. వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి  ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకం కింద 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ చివరి సంతకం చేశారని తెలిపారు.
 
సచివాలయం వద్ద ఇళ్ల పథకం పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ తరువాత 11 గంటలకు ఉప రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు.  
 
వెలగపూడిలో తన పర్యటన ముగించుకొని సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉపరాష్ట్రపతి  తెనాలి వెళతారని చెప్పారు. అక్కడ ఆలపాటి వెంకట్రామయ్య శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని, వెంకట్రామయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెనాలిలో తల్లి, బిడ్డల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ కార్యక్రమాలకు ఉప రాష్ట్రపతి వెంట మంత్రి నక్కా ఆనందబాబు ఉంటారని తెలిపారు.
 
సాయంత్రం 4.30 గంటలకు ఉప రాష్ట్రపతి పర్యటన ముగించుకొని గన్నవరం వద్ద ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ కు వెళతారు. ఆదివారం ఉదయం 9 గంటలకు స్వర్ణభారతి ట్రస్టు లో ఏర్పాటు చేసే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ వైద్య శిబిరంలో హైదరాబాద్ నుంచి, మణిపాల్ ఆస్పత్రి నుంచి డాక్టర్లు వస్తారని తెలిపారు. అనంతరం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఉప రాష్ట్రపతి ఢిల్లీ బయలుదేరతారని మంత్రి కామినేని చెప్పారు.