శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 20 సెప్టెంబరు 2014 (20:24 IST)

మంగళగిరి - విజయవాడ మెట్రో రైలు... రాజధాని ఇటే...

విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణంపై ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ప్రాధమిక పరిశీలన పూర్తి చేసినట్లు శ్రీధరన్ తెలిపారు. విజయవాడ, మంగళగిరిని కలుపుకుని 30 కిలోమీటర్ల పొడవైన మెట్రోరైలు మార్గాన్ని నిర్మిస్తామనీ, ప్రతి కిలోమీటర్‌కు ఒక రైల్వే స్టేషన్ ఉంటుందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడకు ఆవల కాదనీ, ఈవల అంటే... మంగళగిరి - విజయవాడ మధ్యే అని తేలిపోయింది. 
 
శ్రీధరన్ మెట్రో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని, దీనివల్ల లాభాలు వస్తాయని అనుకోలేమనీ, కేవలం సేవాభావంతో మాత్రమే నిర్మించవలసి ఉంటుందన్నారు.
 
2015 జనవరి చివరినాటికి ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అలాగే గుంటూరుకు విస్తరిస్తారా అని అడిగినప్పుడు అది సాధ్యం కాదన్నారు. ఆర్థికంగా చాలా కష్టతరమైనదనీ, ఒకవేళ రెండో విడతలో ఏమయినా చేపట్టే అవకాశం ఉండవచ్చన్నారు.