చిత్తూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదనీరు మాత్రం అలాగే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. తిరుపతి నగరంలోని 13 డివిజన్లు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఎటు చూసినా వరదనీరు, అంధకారంలోనే నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు.
సరిగ్గా 50 సంవత్సరాల తరువాత తిరుపతిని వర్షం ముంచెత్తింది. నిరంతరాయంగా పడిన వర్షంతో జనజీవనం మొత్తం అతలాకుతలమైంది. టెంపుల్ సిటీ కాస్త వరదసిటీగా మారిపోయింది. ఎంఆర్ పల్లి, వైకుంఠపురం, సరస్వతినగర్, శ్రీక్రిష్ణనగర్, గాంధీపురం, నక్కలకాలనీ, స్కావెంజర్స్ కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తిరుపతి నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
లక్ష్మీపురం, శ్రీనివాసకళ్యాణ మండపాలు, ఎయిర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ సర్కిళ్ళలో వరదనీరు అలాగే ఉంది. మురికికాలువలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. గత మూడురోజుల నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానే లేదు. అంధకారంలోనే నివసిస్తున్నారు. తిరుచానూరులోని స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహిస్తోంది.
వసుంధరా నగర్‌లో ఐదు ఇళ్ళు కూలిపోవడానికి సిద్థంగా ఉన్నాయి. దీంతో రెవిన్యూ అధికారులు సహాయకచర్యలను ప్రారంభించారు. సురక్షిత ప్రాంతాలకు వసుంధరా నగర్ వాసులను పంపిస్తున్నారు. తిరుపతికి సమీపంలోని రాయలచెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఏ నిమిషమైనా చెరువుకు గండిపడే అవకాశముంది. దీంతో రాయలచెరువు చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని 3 గ్రామాలు నీట మునిగాయి. పీలేరు సమీపంలోని పింఛా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం జలాశయం వరదనీరు కూడా ఉదృతంగా ప్రవహిస్తోంది.
కపిలతీర్థం లోని వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలోని పురాతన మండపం వరద ఉదృతికి కుప్పకూలింది. తిరుపతి నుంచి మదనపల్లె వైపు వెళ్ళే బస్సుల రాకపోకలను నిలిపివేశారు. చిన్నగొట్టికల్లు, కలికిరిల వద్ద రోడ్లు తెగిపోయాయి. అలాగే నగరి మీదుగా వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వడమాలపేట వద్ద వరద నీరు చేరింది. చిత్తూరు ఎన్టీఆర్ జలాశయం చాలా యేళ్ళ తరువాత జలకళను సంతరించుకుంది.
ఇక తిరుమలకు యథావిథిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. రెండు ఘాట్ రోడ్లను తెరిచే ఉంచారు. శనివారం వర్షం పడకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను మాత్రమే అనుమతిస్తున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బంది ద్విచక్ర వాహనాలను మాత్రం అనుమతించడం లేదు. మరోవైపు కాలినడక మార్గాన్ని తాత్కాలికంగా మూసే ఉంచారు. అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్ల మార్గాలను మూసే ఉంచారు.
మెట్ల మార్గంలో కొన్నిచోట్ల పైకప్పులు విరిగిపడ్డాయి. వరద ఉదృతికి మెట్లు కొట్టుకుపోయాయి. దీంతో మరమ్మత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పట్లో మెట్ల మార్గాన్ని తెరిచే అవకాశం లేదు. టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుపతి నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు.
చిత్తూరుజిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. కానీ తిరుపతిలో వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బరాజు అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. వరద నీటిలోనే నరకయాతన అనుభవిస్తున్నారు తిరుపతి వాసులు.
అయితే తిరుపతి నగరంలో వర్ష భీభత్సాన్ని... చిత్తూరు జిల్లాలో తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు అధికారులు. వరదలపై ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఐఎఎస్ అధికారి ప్రద్యుమ్న, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, తిరుపతి నగర పాలకసంస్ధ కమిషనర్ గిరీషాలు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని వరద పరిస్థితిని సిఎంకు వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సురక్షితంగా తరలించామని.. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని.. బాధితులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని సిఎంకు తెలిపారు.