శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (18:54 IST)

వినూత్న రీతిలో డ్రగ్స్ అక్రమ రవాణా... మహిళ కడుపులో డ్రగ్స్ ప్యాకెట్లు..

విదేశాల నుంచి బంగారం, మాదకద్రవ్యాలు దేశంలోకి అక్రమంగా తీసుకురావడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు రాచబాటగా మారింది. పలు దేశాల నుంచి ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతుండడంతో విమానాశ్రయ అధికారులు భద్రతను పటిష్ఠం చేశారు. అయితే అదే స్థాయిలో స్మగ్లర్లు కూడా కొత్త పంథాలను పాటిస్తున్నారు. 
 
అసలు విషయానికి వస్తే... దక్షిణ అమెరికాకు చెందిన మూసా (33) అనే మహిళ దాదాపు రూ.కోటి విలువైన డ్రగ్స్ నింపిన ప్యాకెట్లను తన శరీర అంతర్భాగాల్లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చింది. కాగా, అధికారుల తనిఖీల్లో ఆమె దొరికిపోయింది. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా, ప్యాకెట్ల గుట్టు రట్టయింది. అయితే, ఇలా ప్యాకెట్లను పెట్టుకుని రావడం ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది.
 
తొలుత కొన్ని ప్యాకెట్లను బయటకు తీసిన అధికారులు, మిగిలిన ప్యాకెట్లను తీసేందుకు విఫలయత్నం చేశారు. వారి వల్లకాకపోవడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఎలినొస్కోపి పద్ధతిలో మూసా కడుపులోంచి 40 చిన్న చిన్న ప్యాకెట్లను బయటకు తీశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
 
ఈ సీసాల్లో 500 గ్రాములకు పైగా బ్రౌన్ షుగర్ ఉన్నట్లుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మూసా కోలుకున్నాక విచారణ జరుపుతామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.