శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (16:35 IST)

చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగిపారేసిన వైఎస్. జగన్!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఏపీ ప్రభుత్వ పనితీరు వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చ జరపడానికి 344 నిబంధన కింద నోటీస్ ఇచ్చామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై బుధవారం చర్చిస్తామని దాటవేసే ధోరణిని స్పీకర్ ప్రదర్శించారు. 
 
దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జగన్... మనుషుల ప్రాణాలపై చర్చకన్నా మరో అంశమేమైనా ఉందా అని ప్రశ్నించారు. గత మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరుగుతున్న రాజకీయపరమైన దాడులు, హత్యలు ప్రజల్ని భయభ్రాంతులకు లోను చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై చర్చ కోరడం తప్పా అంటూ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో అన్ని అంశాలను చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని జగన్ సభలో అన్నారు.  
 
శాంతి భద్రతలపై చర్చించడానికి ఎందుకు పారిపోతున్నారు.. సభలో చర్చ జరగాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో వైఎస్ జగన్‌పై అధికారపక్షానికి చెందిన సభ్యులు, మంత్రులు ఎదురుదాడి చేశారు. సభలో చర్చను పక్కదారి పట్టించేందుకు అధికార సభ్యులు ప్రయత్నించారు.