శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (15:08 IST)

రాజ్యాంగ ఉల్లంఘనలో గవర్నర్ భాగస్వామ్యమా? బ్లాక్ డే : వైఎస్ జగన్

ఇతర పార్టీల్లో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రిపదవులు కట్టబెట్టడాన్ని వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

ఇతర పార్టీల్లో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రిపదవులు కట్టబెట్టడాన్ని వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపుదారులను కేబినెట్‌లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ స్పీకర్ అండదండలతోనే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందులో గవర్నర్ నరసింహన్ కూడా పాలుపంచుకోవడంపై దురదృష్టకరమని జగన్ విమర్శించారు.
 
ఇకపోతే.. తమ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించడంపై చంద్రబాబుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. నేడు ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకోవడమనేది రాజ్యాంగానికి, రాష్ట్రానికి జరిగిన ఘోర అవమానమన్నారు. 
 
అలాగే, వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పార్టీ ఫిరాయింపు దారులకు, ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. టీడీపీ పార్టీలో ఇంతకన్నా సమర్థులు లేరా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. 
 
అమరావతి సాక్షిగా ప్రజాస్వామాన్యి నడిరోడ్డుపై హత్య చేశారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన ఘనత చంద్రబాబుదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంలో కంచే చేను మేసినట్టుగా గవర్నర్ నరసింహన్ వ్యవహరించారని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు. 
 
నాడు తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కేటాయించినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని, ఆ మాటలు, విలువలు ఆయనకు ఇప్పుడు గుర్తు రావడం లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.