ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (17:50 IST)

మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం : జగన్ మోహన్ రెడ్డి

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్ట

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఒకవేళ ఈ పని అధికార తెలుగుదేశం పార్టీ చేస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. 
 
ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, టీడీపీ తమకు మద్దతు ఇస్తుందా? అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ వేదికగా ఏపీకి హోదా కోసం ఎంపీలు పోరాటం చేస్తారని, అప్పటికీ హోదా రాకుంటే ఏప్రిల్ 6న లోక్‌సభకు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు.
 
కాగా, రాష్ట్ర హక్కుల సాధన కోసం ఇటు అధికార, అటు విపక్ష ఎంపీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహించారనీ, ప్రజల శ్రేయస్సు కంటే స్వలాభాలకే ప్రాధాన్యత ఇచ్చారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదంటూ ప్రశ్నించారు. దీంతో జగన్ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించారు.