శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (13:51 IST)

జగన్ అక్రమాస్తుల డొంక కదిలిందిలా... హైదరాబాద్‌లోని ఆస్తుల మాటేంటి?

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లండన్ పర్యటన ఏమాత్రం అచ్చొచ్చినట్టు కనిపించడం లేదు. ఆయన తన కుటుంబ సభ్యులతో లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు.

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లండన్ పర్యటన ఏమాత్రం అచ్చొచ్చినట్టు కనిపించడం లేదు. ఆయన తన కుటుంబ సభ్యులతో లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన గోల్ఫ్, చెస్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు ఆడుతూ... సేద తీరారు. ఆ తర్వాత ఈనెల 27వ తేదీ రాత్రి హైదరాబాద్ నగరానికి వచ్చారు. 29వ తేదీ రాత్రి తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేత ఒకరు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్.. పార్టీ నేతలతో మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఇంతలో పార్టీ నేతల నుంచి జగన్‌కు ఓ వార్త వచ్చింది. అది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే అధికారులు తాజాగా రూ.749 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసినట్టు దాని సారాంశం. ఆ తర్వాత జగన్ హావభావాలు క్షణాల్లో మారిపోయాయి. 
 
అయితే, జగన్ అక్రమాస్తుల డొంక ఎలా కదిలిందో ఓ సారి పరిశీలిస్తే... తన తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ (క్విడ్ ప్రో కో) రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి శంకర్రావు హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మొత్తం మూలాల్లోకి దిగి రూ.43 వేల కోట్ల అక్రమ వ్యవహారాలను నిగ్గు తేల్చింది. 
 
వాటికి సంబంధించి 11 చార్జిషీట్లను దాఖలు చేసింది. ఐపీసీ, హవాలా చట్టాల నిబంధనలతోపాటు నేర పూరిత కుట్రలు, నిబంధనలకు నీళ్లు వదిలిన తీరు, మనీ లాండరింగ్‌, విదేశీ కంపెనీల పెట్టుబడులు, పన్ను ఎగవేత దేశాల నుంచి జగన కంపెనీలు చేసిన ఆర్థిక లావాదేవీలను పూసగుచ్చినట్లు వివరించింది. ఇవే చార్జిషీట్ల ఆధారంగా... ఈడీ కూడా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేసింది. ఆస్తులను అటాచ్‌ చేయడం మొదలుపెట్టింది. తాజాగా... భారతీ సిమెంట్స్‌ కేసులో చర్యలు తీసుకుంది. 
 
ప్రస్తుతం రూ.749 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్ చేసింది. గతంలో రూ.500 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్‌ చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోనే భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న సాక్షి మీడియా భవనం విలువ రూ.43.70 కోట్లుగా ఈడీ అంచనా వేసింది. జగన్ నివాసమైన లోటస్‌ పాండ్‌లో ఉన్న ఇంటి విలువ రూ.56.89 కోట్లు. 
 
అలాగే, గుంటూరు సరస్వతీ పవర్‌కు చెందిన భూముల విలువ రూ.31 కోట్లు. వీటితో పాటు.. భారతీ సిమెంట్స్‌లో 51 శాతం షేర్లను ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీ ఒకటి రూ.2500 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇందులో జగన్‌కు ఉన్న 49 శాతం ఈక్విటీ షేర్లను ఈడీ జప్తు చేసింది. వీటి విలువ రూ.23.80 కోట్లుగా వెల కట్టింది. అయితే, ఫ్రాన్స్‌ కంపెనీకి అందిన షేర్ల విలువ ప్రకారం లెక్కగడితే ఈ షేర్ల ధరలు రూ.2600 కోట్లకు (ప్రస్తుత డాలర్‌తో రూపాయి విలువ ప్రకారం) పైమాటగానే ఉంది. మొత్తంమీద ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.749 కోట్లుగా చెపుతున్నప్పటికీ.. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ విలువ రూ.నాలుగు వేల కోట్లకు పైగానే ఉన్నట్టు సమాచారం.