గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (16:09 IST)

ఢిల్లీలో విజయమ్మ.. రాజశేఖర్ రెడ్డి వుండివుంటే ఇలా జరిగివుండేది కాదు..?

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైకాపా ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైకాపా ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ చేరుకున్నారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేదే కాదని, పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. 
 
మాటపై నిలబడే వ్యక్తి వైఎస్సార్ అని.. అదే గుణం జగన్‌లోనూ వుందని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో జగన్ ఎంతో శ్రమించారని, విడిపోయిన తరువాత కూడా ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని తొలి నుంచి నమ్మిన ఏకైక పార్టీ వైకాపాయేనని విజయమ్మ గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్, బీజేపీ తదితర అన్ని పార్టీలూ కలసి ఏపీని ఆటబొమ్మగా చేసుకున్నాయని విజయమ్మ ఆరోపించారు. ఆనాడు కేవలం జగన్‌ను అణగదొక్కేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చించిందని.. ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఆనాడే విభజన హామీలను చట్టం రూపంలో తీసుకుని వచ్చుంటే, నేడు ఇలాంటి నిరసనలు జరిగి ఉండేవి కావని కాంగ్రెస్‌పై విజయమ్మ విమర్శలు గుప్పించారు. 
 
గడచిన మూడు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల్లో ఒకరైన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన వెంటనే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. ఆయన తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడుతున్న మేకపాటి, దీక్షను కొనసాగిస్తే, ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. 
 
అలాగే ఏపీకి ప్రత్యేక హోదా నిమిత్తం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలలో మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆయన దీక్ష చేయడం సరికాదని వైద్యులు హెచ్చరించారు. వైద్యుల సూచనల మేరకు పోలీసులు బలవంతంగా ఆయన్ని అంబులెన్స్‌లో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూకు తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.