శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 4 మే 2015 (14:01 IST)

ఆయన డీజీపీ కాదు.. టీడీపీ నేతలకు అన్నా.. మామా : జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన రాష్ట్రానికి డీజీపీగా వ్యవహరించడం లేదనీ, టీడీపీ నేతలకు వెన్నుదన్నుగా ఉంటున్నారనీ, అందుకే వారంతా ఆయనను అన్నా, మామ అని పిలుస్తుంటారన్నారు. పైగా.. అనంతపురంకు వస్తే టీడీపీ నేతల ఇళ్ళలో అల్పాహారాలు, విందులు వినోదాల్లో పాల్గొంటారని మండిపడ్డారు. 
 
అనంతపురం జిల్లాలో జరుగుతున్న హత్యలపై తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్యను ఆయన ప్రస్తావించారు. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కారు యత్నిస్తోందని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న అధికారపక్షాన్ని నిలువరించాలని ఆయన గవర్నర్‌ను కోరారు.
 
అలాగే, రాష్ట్ర డీజీపీ రాముడుపై కూడా ఆయన విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలను కలిగి ఉన్న డీజీపీ... ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సొంత జిల్లా అనంతపురంలోనే హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డీజీపీని టీడీపీ నేతలు... అన్నా, మామా అంటూ పిలుస్తారని అన్నారు. ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో స్థానిక ఎస్ఐని వీఆర్‌కు వేస్తే, మరుసటి రోజే తిరిగి పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. రెండు నెలల్లో రిటైర్ కావాల్సిన డీజీపీ రాముడుకి రెండేళ్ల సర్వీస్ పొడిగించారని విమర్శించారు.