మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (11:07 IST)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక ఎందుకు దొరకడం లేదు? ప్రభుత్వం ఏమంటోంది?

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ఉపాధి లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉండటం. దీంతో అధకార పక్షం ఇసుక సరఫరాలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. జ‌న‌సేన విశాఖ‌లో లాంగ్ మార్చ్ చేయాల‌ని నిర్ణ‌యించింది.
 
అయితే, వ‌ర‌ద‌ల కార‌ణంగా కొంత కొర‌త ఉంద‌ని, అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం అంటోంది. అస‌లు ఇసుక స‌మ‌స్య‌కు కార‌ణాలు ఏంటి... దీనికి మూలాలు ఎక్కడ?
 
అపార వనరులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక ల‌భ్య‌త‌కు అన్ని ర‌కాలుగా అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణా, పెన్నా, తుంగ‌భ‌ద్ర వంటి న‌దీ తీరాల‌లోనూ, అన్ని కాలువ‌ల ద్వారానూ ఇసుక ల‌భిస్తోంది. నాణ్య‌మైన ఇసుక ల‌భిస్తుండ‌డంతో ఇక్కడి నుంచి తెలంగాణకు కూడా ప‌లు రీచ్‌ల నుంచి ఇసుక స‌ర‌ఫ‌రా అయ్యేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.
 
గ‌డిచిన ఐదు నెల‌లుగా ఇసుక కొరత తీవ్రమైంది. భవన నిర్మాణ పనులు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి వరద ఒక కారణమైతే, వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ మరో కారణమని తెలుస్తోంది.
 
రెండు ప్రభుత్వాలు.. అనేక విధానాలు
ఇసుక విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం కూడా ప‌లు ప్ర‌యోగాలు చేసింది. ఇసుక‌ ఉచితంగా సరఫరా చేయడంతో పాటు డ్వాక్రా గ్రూపుల ద్వారా త‌వ్వ‌కాలు చేపట్టింది. అయితే, ఇసుక త‌వ్వ‌కాల‌ను కొంద‌రు త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకుని, పెద్ద స్థాయిలో అక్ర‌మార్జ‌న‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసుక మాఫియా వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
 
అప్పుడు అధికార పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు నేరుగా ఇసుక వ్య‌వ‌హారాల్లో భాగ‌స్వాముల‌యిన‌ట్టు ఆరోపణలు వచ్చాయి. నాటి దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇసుక వ్యవహారంలో త‌హాశీల్దార్ వ‌న‌జాక్షి మీద దాడికి దిగడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక విధానంలో మాఫియాకు, అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌క‌త కోస‌మంటూ ఇసుక త‌వ్వ‌కాల అనుమ‌తి విష‌యంలో జాప్యం చేసింది.
 
మే నెలాఖ‌రులో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కూ ఇసుక త‌వ్వ‌కాలు నిలిపివేసింది. ఆ తర్వాత ఆన్ లైన్ ప‌ద్ధ‌తిలో ఇసుక బుకింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇసుక అవ‌స‌రమైన వారు ట‌న్నుకు రూ.375 చొప్పున బ్యాంకులో చ‌లానా తీసి, ఆధార్ కార్డు, నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తి ప‌త్రాల‌ను తీసుకుని రెవెన్యూ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
 
దానికి ముందుగా వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకుంటే ఓ నెంబ‌ర్ వ‌స్తుంది. వాటిని ఆధారం చేసుకుని ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతాల్లోని త‌హాశీల్దార్ ఆఫీసుకి వెళితే అక్క‌డ వారు ర్యాంప్ కేటాయిస్తారు. ఆ ర్యాంపు ద‌గ్గ‌ర ఉన్న ఏపీఎండీసీ సిబ్బంది ప‌రిస్థితిని బ‌ట్టి ఇసుక లోడుకి అనుమ‌తిస్తున్నారు. ఇసుక త‌ర‌లింపు కోసం దూరాన్ని బ‌ట్టి ఛార్జీ వ‌సూలు చేస్తారు.
 
ఇలా కూడా సమస్యలే
ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానం వల్ల తీవ్ర స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని, ఇసుక కోసం ర్యాంపుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంద‌ని భవన నిర్మాణదారు టి. శ్రీనివాస్ చెప్పారు.
 
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఇసుకను గ‌తంలో క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామ‌ని చెప్పారు. గ‌తంలో రూ. 2,500 ఇస్తే జిల్లాలో ఎక్కడికైనా ట‌న్ను ఇసుక వచ్చేది. కానీ ఇప్పుడు బ్యాంకుల చుట్టూ చ‌ల‌నా కోసం తిర‌గ‌డం, ఆ త‌ర్వాత త‌హాశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిర‌గ‌డానికే స‌రిపోతోంది. వారం రోజులు పైగా ప‌ని మానుకోని తిరిగితేగానీ ఇసుక దొర‌క‌డం లేదు. ఇసుక 15 రోజుల‌కు వ‌స్తుందో, నెల‌కు వ‌స్తుందో కూడా గ్యారంటీ లేదు. మా ద‌గ్గ‌ర‌కు ఇసుక వచ్చేసరికి ట్రిప్పుకే రూ. 4,500 అవుతుంది. లారీ వాళ్లు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. క‌న‌స్ట్ర‌క్ష‌న్స్ మొద‌లెట్టిన మా లాంటి వాళ్ల స‌మస్య‌ల గురించి ప్ర‌భుత్వం ఆలోచించాలి'' అని తెలిపారు.
 
నిర్మాణాలు నిలిచిపోయి.. ఉపాధి పోయి
ఇసుక ల‌భ్య‌త నిలిచిపోవ‌డంతో భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఉపాధికి విఘాతం క‌లిగింది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులున్నారు. వారితో పాటుగా భ‌వ‌న నిర్మాణ అనుబంధ రంగాలైన ఇటుక త‌యారీ, కంక‌ర క్వారీలు, మెటీరియ‌ల్ ర‌వాణా లారీలు స‌హా వివిధ రంగాల్లో మ‌రో 20 ల‌క్ష‌ల మంది కార్మికులు ఆధార‌ప‌డి ఉంటార‌ని అంచ‌నా. ఇసుక కొరత మూలంగా 3 నెల‌ల పాటు పూర్తిగా ఉపాధి నిలిచిపోయింద‌ని భ‌వ‌న నిర్మాణ మేస్త్రీ కంచుమ‌ర్తి కాటంరాజు బీబీసీకి తెలిపారు.
 
''భవ‌న నిర్మాణాల‌కు సీజ‌న్ లేకపోవడం అంటూ ఉండ‌దు. వేస‌విలో నిర్మాణాలు చేస్తే, వ‌ర్షాల స‌మ‌యంలో ఫినిషింగ్ వ‌ర్క్ చేస్తాం. కానీ, ఇప్పుడు గ‌తంలో ప‌నికి వెళ్లిన వారిలో నూటికి ఐదుగురికి కూడా ప‌ని దొర‌క‌డం లేదు. దాంతో ప‌నుల్లేక చాలా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఒక్క మేస్త్రీలకే కాకుండా కూలీలు, కార్పెంట‌ర్లు, ఎల‌క్ట్రిక‌ల్ వ‌ర్క‌ర్లు, రాడ్ బెండింగ్ , సెంట్రింగ్ వ‌ర్క‌ర్లకి కూడా ప‌నుల్లేకుండా పోయింది. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ లేదు'' అని చెప్పారు.
 
తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురంలో ఫాల్జీ బ్రిక్ యూనిట్ న‌డుపుతున్న బి వెంక‌ట్ కూడా ఇలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్తం చేశారు. ''గతంలో నేను ఇదే సీజ‌న్‌లో నెల‌కు 1.8 ల‌క్ష‌ల ఇటుకలు త‌యారీ చేశాను. కానీ ఇప్పుడు 10 వేలు కూడా అమ్ముడు పోవ‌డం లేదు. మా యూనిట్‌లో 12 మంది కార్మికులు ప‌నిచేసేవారు. ఇప్పుడు ఒక్క‌రు మాత్ర‌మే ప‌నిచేయ‌డానికి అవ‌కాశం ఉంది. మాలాంటి అన్ని యూనిట్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి. అప్పులు చేసి గ‌డుపుతున్నాం'' అని అన్నారు.
 
లారీల య‌జ‌మానుల‌క‌యితే మ‌రింత స‌మ‌స్య‌గా ఉంద‌ని గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లికి చెందిన లారీ య‌జ‌మాని ర‌వీంద్ర అంటున్నారు. లారీల‌కు కిస్తీలు కూడా క‌ట్ట‌లేక‌పోతున్నామని, నాలుగు నెల‌ల‌కు పైసా ఆదాయం లేదని చెప్పారు. ''మూడు లారీలున్నాయి. రెండు నెల‌ల పాటు పూర్తిగా మూల‌న‌ప‌డ్డాయి. ఇప్పుడు నెల‌కు 10 రోజులు తిప్పుతున్నాం. రోజుకి ఒక ట్రిప్పు వేస్తే రూ. 2 వేల లోపు ఆదాయం వ‌స్తోంది. బ్యాంకుల‌కు అప్పులు కూడా క‌ట్ట‌లేక స‌త‌మ‌త‌మ‌యిపోతున్నాం'' అంటూ వాపోయారు.
 
ప్రభుత్వం ఏమంటోంది?
అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఇసుక ల‌భించ‌డం లేద‌ని ప్ర‌భుత్వం కూడా అంగీక‌రిస్తోంది. స‌మ‌స్య‌ను అధిగమించేంద‌కు ప్ర‌య‌త్నిస్తున్నాంటున్నారు. అధికారిక వివ‌రాల ప్ర‌కారం ఏపీలో మొత్తం 151 ఇసుక రీచులున్నాయి. వాటిలో 36 రీచుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం 115 రీచులు ఇసుక త‌వ్వ‌కాల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 79 రీచుల‌కు వ‌ర‌ద తాకిడి కార‌ణంగా ఇసుక త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు.
 
ఇసుక స‌మ‌స్య‌పై ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి స‌ల్మాన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ, ''రాష్ట్రంలో రోజుకి 80 నుంచి 85 ట‌న్నుల ఇసుక అవ‌స‌రం అవుతుంది. అది నిర్మాణాలు పుంజుకుంటే ల‌క్ష ట‌న్నులకు చేరుతుంది. అయితే ప్ర‌స్తుతం ఏపీఎండీసీ స్టాక్ పాయింట్ల ద్వారా 45 టన్నుల ఇసుక అందిస్తున్నాం. న‌దుల్లో వ‌ర‌ద నీరు త‌గ్గితే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా అందించ‌గ‌లం. ర్యాంపుల‌న్నీ అందుబాటులోకి వ‌స్తే స‌మ‌స్య తీరుతుంది. ప్ర‌స్తుతం తాత్కాలికంగా ఏరులు, వాగులు, వంక‌ల్లో కూడా ఇసుక త‌వ్వ‌కాల‌కు అనుమ‌తిచ్చాం. త‌ద్వారా స్థానికంగా ఇసుక అవ‌స‌రం అయినా వారికి అది చేరుతుంది. అందుకు అనుగుణంగా మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చి అందుబాటులోకి తీసుకొచ్చాం'' అని పేర్కొన్నారు.
 
'వరద నీటి వల్లే'
గ‌త ప‌దేళ్లుగా ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి వ‌ర్షాల కార‌ణంగా దాదాపు అన్ని న‌దుల‌కు వ‌ర‌ద తాకిడి క‌నిపిస్తోంది. గోదావ‌రి, కృష్ణా న‌దుల్లో గ‌డిచిన 70 రోజులుగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది. దాని కార‌ణంగానే ఇసుక స‌మ‌స్య వ‌స్తోంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. వ‌ర‌ద కార‌ణంగా 70 రీచులలో త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం లేకుండా పోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు.
 
''నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం'' అని తెలిపారు.
 
గత 30-40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సరఫరా చేశామని మంత్రి వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) ప్రతినిధులతో మాట్లాడి వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించామని చెప్పారు.
 
'ఇది ప్ర‌భుత్వ వైఫ‌ల్యం'
ఇసుక విష‌యంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం మూలంగానే కార్మికులు, భ‌వ‌న య‌జ‌మానులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని టీడీపీ, జ‌న‌సేన స‌హా వివిధ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత‌ల మీద క‌క్ష‌తో వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందని, ఇసుక ర్యాంపుల నుంచి టీడీపీ శ్రేణుల‌ను దూరం చేయ‌డం కోస‌మే మూడు నెల‌ల పాటు మూత వేశారని చెప్పారు.
 
''టీడీపీ నేత‌ల ఆర్థిక‌మూలాల మీద దెబ్బ‌తీయాల‌ని చూసి, చివ‌ర‌కు రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలుకావ‌డానికి కార‌ణం అయ్యారు. ఇసుక‌ను ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ, బ్లాకులో అమ్ముకుంటున్నారు. ప్ర‌భుత్వ తీరుపై న‌వంబ‌ర్ 3న లాంగ్ మార్చ్ నిర్వ‌హిస్తున్నాం. విశాఖ న‌గ‌రంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత ప్ర‌భుత్వ తీరు మార‌క‌పోతే ఉద్య‌మం చేప‌డ‌తాం'' అని హెచ్చ‌రించారు.
 
గ‌డిచిన ఆరు నెల‌ల కాలంలో రిజిస్ట్రేష‌న్ల ద్వారా ప్ర‌భుత్వానికి ల‌భించే ఆదాయం కూడా ప‌డిపోయింది. 2018 తో పోలిస్తే ఈ ఏడాది 27 శాతం త‌గ్గుద‌ల ఉంద‌ని ఇటీవ‌ల స్టాంప్స్ రిజిస్ట్రేష‌న్ శాఖ తెలిపింది. దానికి కూడా ఇసుక ల‌భ్య‌త లేక‌పోవ‌డం, నిర్మాణ రంగం స్తంభించిపోవ‌డం కూడా ఓ కార‌ణ‌మనే వాద‌న ఉంది.