పాపం చందా కొచ్చర్ : అపుడు పదవి పాయె.. ఇపుడు బోనస్ కూడా వెనక్కి....
చందా కొచ్చర్.. ఒకపుడు ఈ పేరు చెబితే ప్రతి మహిళ గర్వంతో ఉప్పొంగిపోయేది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఐసీఐసీఐ బ్యాంకుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2009 సంవత్సరం అక్టోబరు నుంచి 2018 వరకు ఆమె ఓ వెలుగు వెలిగారు. కానీ, అధికార దుర్వినియోగంతో ఆమె పేరుప్రతిష్టలన్నీ ఒక్కసారిగా మంటగలిసిపోయాయి.
వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్‌కు రూ.3,250 కోట్ల రుణాన్ని ఆమె మంజూరు చేశారు. దీనికి ప్రతిఫలంగా తన భర్తకు చెందిన న్యూపవర్ కంపెనీలో వేణుగోపాల్‌తో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో 2018లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఈ అధికార దుర్వినియోగం, రుణాల మంజూరుపై సీబీఐ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో 2009 నుంచి ఆమె పెర్ఫార్మెన్స్ బోనస్ కింద తీసుకున్న రూ.10 కోట్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ శ్రీకృష్ణా ప్యానెల్ తేల్చి చెప్పింది. ఇదే అంశంపై ఈ కమిటీ ఒక నివేదిక కూడా ఇచ్చింది.