శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:53 IST)

దుబాయ్ - చెన్నైల మధ్య ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు

దుబాయ్ కేంద్రంగా పని చేసే ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ దుబాయ్ - చెన్నైల మధ్య వారానికి మూడు సర్వీసులను ప్రారంభించింది. దుబాయ్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులతో చెన్నై అత్యంత ప్రధాన కేంద్రంగా ఉందని అందువల్లే ఈ సర్వీసులను ప్రారంభించినట్టు పేర్కొంది. ఇది ఎనిమిదో డెస్టినేషన్ సర్వీస్ అని తెలిపింది. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ఇది ఎంతగానే దోహదపడుతుందని వివరించింది.
 
ఫ్లై‌దుబాయ్ సర్వీసులు భారత్‌లో గత 2010లో లక్నో నుంచి ప్రారంభమైనట్టు గుర్తు చేసింది. ఇపుడు.. ఎనిమిదో డెస్టినేషన్ పాయింట్‌గా చెన్నై అవతరించింది. ఈ సర్వీసులు వారంలో మూడు రోజులు ఉంటాయి. దీంతో ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ దుబాయ్ నుంచి భారత్‌కు నడిపే విమాన సర్వీసుల సంఖ్య 29కు చేరినట్టయింది. 
 
ఇదే అంశంపై ఫ్లైదుబాయ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఘైత్ అల్ ఘైత్ మాట్లాడుతూ... భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించే చర్యల్లో భాగంగా కొత్త సర్వీసులు ప్రారంభించినట్టు తెలిపారు. భారత్, దుబాయ్‌ల మధ్య బలమైన ఆర్థిక, సాంస్కృతి బంధం ఉందన్నారు. అందుకే ఈ రీజియన్‌లో మరిన్ని సేవలు ప్రారంభించేందుకు కట్టుబడివున్నట్టు తెలిపారు. గత 2014లో కొచ్చి, ముంబై, ఢిల్లీ, తిరువనంతపురంలకు సర్వీసులు ప్రారంభించినట్టు తెలిపారు. 
 
అనంతరం జీసీసీ, ఆఫ్రికా ఉపఖండం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్) సుధీర్ శ్రీధరన్ స్పందిస్తూ.. ఫ్లైదుబాయ్ సంస్థకు భారత్ అత్యంత ప్రధానమైన మార్కెట్, అందుకే ఎకానమీ లేదా బిజినెస్ క్లాస్ తరగతి ప్రయాణికులకు అత్యున్నత సేవలతో కూడిన రవాణా సేవలు అందించేందుకు కట్టుబడివున్నట్టు తెలిపారు. గత 2014లో ప్రారంభించిన నాలుగు పాయింట్ల సర్వీసుల వల్ల ఫ్లైదుబాయ్ సంస్థ ప్రయాణికుల రవాణాలో 70 శాతం వృద్ధిని సాధించినట్టు వివరించారు. 
 
దుబాయ్‌కు ఒక్క చెన్నై నుంచే కాకుండా భారత్‌లోని ఇతర ప్రాంతాలైన అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, లక్నో, ముంబై, తిరువనంతపురంల నుంచి కూడా సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, ముంబై, తిరువనంతపురం విమానాల్లో బిజినెస్ క్లాస్ సర్వీసులు కూడా ఉన్నట్టు తెలిపారు.