శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (18:28 IST)

డిమాండ్ లేక తగ్గిన బంగారం ధర.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బుధవారం కూడా బంగారం ధర తగ్గింది. రూ.190 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,060కి చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 
 
అంతర్జాతీయంగా సింగపూర్‌, లండన్‌ బులియన్‌ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర వరసగా 0.3 శాతం, 0.52 శాతం తగ్గి 1,083.11, 1,080.90 అమెరికన్‌ డాలర్లకు చేరింది. అలాగే ఈ రోజు వెండి ధర కూడా తగ్గింది. రూ.100 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.33,400కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపారు.
 
మరోవైపు.. స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. చైనా మార్కెట్ల ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో భారత స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెల్సిందే. కానీ, బుధవారం లాభాల బాట పట్టి సెన్సెక్స్‌ 172 పాయింట్లు లాభపడి 24,854 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,562 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.83 వద్ద కొనసాగింది.