రెండేళ్ళ తర్వాత రూ.33ను రీఫండ్ చేసిన ఐఆర్‌సీటీసీ
ఓ ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న రిజర్వేషన్ టిక్కెట్‌ను రద్దు చేసుకున్నాడు. ఇలాంటి సమయాల్లో క్లరికల్ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని ఏడు పనిదినాల్లో ప్రయాణికుడు ఖాతాలో జమ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఓ ప్రయాణికుడుకి రెండేళ్ళ తర్వాత రూ.33 రీఫండ్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాకు చెందిన ఇంజినీర్ సుజీత్ స్వామి (30) గత 2017 జూలై 2న ఢిల్లీ వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. గోల్డెన్ టెంపుల్ రైలులో టికెట్‌కు గాను రూ.765 చెల్లించాడు. అయితే, అనివార్య కారణాల వల్ల జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు రోజు టికెట్‌ను రద్దు చేసుకున్నాడు.
అయితే, టికెట్ రద్దు చేసుకున్న సుజీత్‌కు కేన్సిలేషన్ చార్జీ రూ.65, జీఎస్టీ రూ.35 కలుపుకుని రూ.100 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ అవాక్కయ్యాడు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే తాను టికెట్‌ను రద్దు చేశానని, కట్ చేసిన రూ.35 ఇవ్వాలని ఐఆర్‌సీటీసీని కోరాడు.
వారు నిరాకరించడంతో సుజీత్ గతేడాది ఏప్రిల్‌లో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించాడు. ఈ కేసులో తాజాగా సుజీత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. లోక్ అదాలత్ తీర్పుతో ఐఆర్‌సీటీసీ రెండేళ్ల తర్వాత తాజాగా అదనంగా కట్ చేసిన రూ.33ను స్వామి ఖాతాలో జమచేసింది.