శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (10:30 IST)

కింగ్ ఫిషర్ హౌస్‌ను స్వాధీనం చేసుకున్న బ్యాంకుల బృందం!

ఒకప్పుడు లిక్కర్ కంపెనీ యునైటెడ్ బీవరేజస్ (యూబీ) చీఫ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన కింగ్ ఫిషర్ హౌస్‌ను భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల బృందం స్వాధీనం చేసుకుంది. 
 
అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపిన విజయ్ మాల్యా ప్రతిష్ట ఇపుడు పూర్తిగా దిగజారిన విషయం తెల్సిందే. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ సమీపంలో విలే పార్లే వద్ద ఉన్న కింగ్‌ ఫిషర్ ఎయిర్‌ లైన్స్‌ అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన 'కింగ్‌ ఫిషర్ హౌస్'ను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా. 
 
తన కలల భవనమని మాల్యా చెప్పుకునే ఈ బిల్డింగ్ మొత్తం 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుంది. కాగా, మూతబడిన కింగ్ ‌ఫిషర్ ఎయిర్‌ లైన్స్ నుంచి 20 బ్యాంకులకు మొత్తం రూ.6,800 కోట్ల మేర రుణ బకాయిలు (వడ్డీ కాకుండా) రావాల్సి ఉంది. వీటిని చెల్లించడంలో మాల్యా విఫలం కాగా, కొన్ని బ్యాంకులు ఆయనపై ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను కూడా వేసిన సంగతి తెలిసిందే.