శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (15:24 IST)

అరెస్టును తప్పించుకునేందుకు విజయ్ మాల్యా తిప్పలు..

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇందుకోసం ఆయన బ్యాంకులను శరణుజొచ్చారు. తనను అరెస్టు చేయకుండా మీరే రక్షించాలంటూ దీనంగా ప్రాధేయపడుతున్నారు. చేజేతులా చేసిన తప్పులతో దివాలా తీసి బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బాకాయిలు పడిన విషయం తెల్సిందే. వీటిని తీర్చలేక అష్టకష్టాలు పడుతున్నారు. 
 
ఈ క్రమంలో తమ వద్ద తీసుకున్న రూ.950 కోట్ల రుణం చెల్లించలేదని ఐడీబీఐ బ్యాంకు కేసు పెట్టింది. దీనిపై సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. దీంతో విజయ్ మాల్యా అరెస్టు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 
ఇందులోభాగంగా తన పేరిట దేశవిదేశాల్లో ఉన్న ఆస్తులను, యూబీ గ్రూప్, యునైటెడ్ స్పిరిట్స్, మంగళూరు కెమికల్స్ తదితర కంపెనీల్లో ఉన్న ఈక్విటీ వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా బ్యాంకులతో చర్చించి తాను కట్టాల్సిన మొత్తాలను సెటిల్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించనున్నారని సమాచారం. 
 
కాగా, ప్రస్తుతం పలు భారత బ్యాంకులకు మాల్యా దాదాపు రూ.7 వేల కోట్ల వరకూ రుణాలను చెల్లించాల్సి వుంది. ఇదేసమయంలో యునైటెడ్ స్పిరిట్స్‌లో మాల్యాకు ఉన్న నాలుగు శాతం వాటాను విక్రయిస్తే, రూ.2,200 కోట్లు లభిస్తాయి. ఇక యునైటెడ్ బ్రీవరీస్‌లో ఆయనకున్న 32.62 శాతం వాటాలను విక్రయిస్తే, రూ.8,500 కోట్లు లభిస్తాయి. వీటికి అదనంగా యునైటెడ్ బ్రీవరీస్‌లో రూ. 4,411 కోట్ల విలువైన వాటాలు మాల్యాకు ఉన్నాయి. వీటిని విక్రయించడం ద్వారా మాల్యా సులువుగానే బయటపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.