శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (02:20 IST)

ఆర్నెల్ల తర్వాతే చిన్నమ్మకు బెయిల్: చెన్నయ్ జైలుకు తరలింపు ఇక మర్చిపోవలిసిందే!

ఆరునెలల తరువాతనే శశికళకు పెరోల్‌ లభించే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య బుధవారం మీడియాకు తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలితతో (దాదాపు) సమానంగా గౌరవ మర్యాదలు అందుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన జీవితంలో రెండోసారి జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినపుడు జయతోపాటూ సుమారు ఆరునెలలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడగా ఈనెల 15వ తేదీ నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పర అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా అత్యున్నతమైన హోదాను తృటిలో చేజార్చుకున్న శశికళ జీవితంపై సర్వాత్రా ఆసక్తి నెలకొని ఉంది. జైల్లోని ఖైదీల సెల్‌లోకి వెళ్లిన రోజున శశికళ ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా గడిపారు. తనలో దుఃఖాన్ని బైటకు కనపడనీయకుండా జాగ్రత్తపడ్డారు. సుమారు నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదనే సత్యాన్ని ఆకళింపు చేసుకున్నట్లుగా రానురానూ జైలు జీవితానికి అలవాటు పడుతున్నారు. మొదటి రోజున ఆమెకు చాప, రెండు నీలం రంగు చీరలు, చెంబును ఇచ్చారు. ప్రస్తుతం ఇనుప మంచం, రెండు దుప్పట్లు, టీవీ వసతిని కల్పించారు.
 
ఆధ్యాత్మిక జీవనం ప్రతిరోజూ తెల్లవారుజాము 5 గంటలకు నిద్రలేచి ఒకగంటపాటు తన సెల్‌లోనే ధాన్యం, 6.30 గంటలకు వేడినీళ్లతో స్నానమాచరించి, జైలు ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయ రాకపోకల్లో ఇళవరసి కూడా శశికళను అనుసరిస్తున్నారు. జయ జైల్లో ఉన్నపుడు ఆలయ ప్రాంగణంలో తులసి చెట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ ప్రార్థనలు చేసేవారు. నేడు శశికళ అదే మండపం వద్ద పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ తరువాత తమిళం, ఇంగ్లిషు వార్తా పత్రికలు చదువుతున్నారు. ఉదయం 6.30 గంటలకు టిఫిన్‌ తినడం పూర్తి చేసుకుని మధ్యాహ్నం వరకు టీవీని చూస్తూ కాలంగడుపుతున్నారు. సందర్శకులు ఎవరైనా వస్తే వారిని కలుస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు జైల్లో పెట్టే ఆహారాన్ని ఆరగించి,  రాత్రి 10 గంటల తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆరునెలల తరువాతనే శశికళకు పెరోల్‌ లభించే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య  బుధవారం మీడియాకు తెలిపారు.
 
మరో జైలుకు శశికళ జైలుమెట్‌ సైనేడు మల్లిక  జైల్లో శశికళకు కేటాయించిన పక్కసెల్‌లో సైనేడ్‌ మల్లిక (52) అనే మహిళ పలు హత్యల నేరంపై శిక్షను అనుభవిస్తోంది. ఆమెను మరోచోటకు మార్చాల్సిందిగా శశికళ పదే పదే జైలు అధికారులను ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. శశికళ విజ్ఞప్తి మేరకు సైనేడ్‌ మల్లికను బెంగళూరు జైలు నుంచి  బెల్గాం జైలుకు మార్చారు.